బీఆర్ఎస్ నాయకులు భయపెడితే భయపడేది లేదు : మంత్రి పొన్నం ప్రభాకర్ - Ponnam Fires on BRS
Published : Feb 15, 2024, 2:01 PM IST
Minister Ponnam At Husnabad Sevalal Program : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల వల్లే గిరిజనుల జీవితాల్లో వెలుగులు నిండాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జిల్లా ప్రతినిధులుగా ఉన్నత స్థాయిల్లో స్థిరపడ్డారని తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బంజారా భవన్లో గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గిరిజన మహిళలతో సాంప్రదాయక నృత్యాలు చేసి అందర్నీ అలరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలోని గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తానన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు నీళ్ల కోసం అసెంబ్లీలో చర్చిస్తే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనపై ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని అడిగితే విరుచుకుపడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు భయపెడితే భయపడేది లేదని, వాళ్లకు తానేమీ పాలేరును కాదన్నారు. సంతు సేవాలాల్ మహారాజ్ ఆశయలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తామన్నారు.