మతుర లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చి 10 శాతం రిజర్వేషన్ కల్పించాలి : లబానా సంఘం - Mathura Lambadi Reservation Issues
Published : Aug 20, 2024, 1:34 PM IST
|Updated : Aug 20, 2024, 3:36 PM IST
Mathura Lambadi Reservation Issues : తమను బీసీ జాబితా నుంచి ఎస్టీ జాబితాలో చేర్చి 10% రిజర్వేషన్ కల్పించాలని మతుర లబానా సమాజ్ డిమాండ్ చేసింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో లబానా సమాజ్ ఆధ్వర్యంలో మతుర లంబాడీలు ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారుల గుండా ర్యాలీ చేపట్టి బస్టాండ్ సమీపంలోని కూడలి వద్ద లబానా సమాజ్ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా లబానా రాష్ట్ర సంఘం అధ్యక్షుడు తాన్ సింగ్ నాయక్ బస్సీ మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేళ్ల నుంచి తమ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మొండి చేయి చూపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. మతుర లంబాడీలను బీసీ జాబితా నుంచి ఎస్టీ జాబితాలో చేర్చి 10% రిజర్వేషన్ కల్పించాలని తాన్ సింగ్ నాయక్ బస్సీ డిమాండ్ చేశారు.
పోడు భూములకు పట్టాలు అందించాలని, తమ అభివృద్ధి కొరకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే లంబాడీల హామీలు నెరవేరుస్తారని మాటిచ్చారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ డిమాండ్ నెరవేర్చాలని రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ నాయక్ బస్సీ డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని తెలిపారు.