Minister Ponguleti Srinivas Reddy about Rythu Bharosa : త్వరలో రైతు భరోసా మొదటి విడత నిధులు జమచేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లో రైతుల కోసం రూ.72 వేల కోట్ల నిధులు వెచ్చించామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు ఇస్తూ పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు. శుక్రవారం నిర్మల్ జిల్లాలోని భైంసాలో మహారాష్ట్ర ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, పదేళ్లలో గత ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు.
త్వరలో స్మార్ట్‌కార్డులు అందిస్తాం : వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటనలో ఎంతటివారున్నా వదిలే ప్రసక్తే లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఐదేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే తర్వాత బహుళ ప్రయోజనాలు అందించే స్మార్ట్‌కార్డులు అందిస్తామని తెలిపారు. ఈ మేరకు ప్రతి ఒక్కరు కులగణన సర్వేకు సహకరించాలని కోరారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఒక్కసారి మాట ఇస్తే మడమతిప్పదన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాహుల్ గాంధీ దేశ ప్రధాని కాగానే తెలంగాణను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
'గత ప్రభుత్వం పదేళ్లలో కొత్తరేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వలేదు. 2020లో తెచ్చిన రెవెన్యూ చట్టం, ధరణి పేరుతో రైతులను భయభ్రాంతులకు గురి చేసింది. ఈ ప్రభుత్వం ప్రతిపక్షాల అభిప్రాయాలను స్వీకరించి అన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకెళ్తోంది'- పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి
రాష్ట్రంలో అన్ని విధాలుగా అభివృద్ధి : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుందని, దాని వల్ల రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడ్డారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను అన్నింటిని సరిదిద్దుకొంటూ ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. అంతకముందు భైంసాలోని విశ్రాంతి భవనంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్థానిక సమస్యలపై అధికారులతో సమీక్షించారు.
తప్పు చేసిన వారిపై త్వరలోనే ఆటం బాంబులు పేలతాయ్! : మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్లు అప్టేడ్: తొలి దశలో వీరికి మాత్రమే ఛాన్స్ - రూ.5 లక్షలు ఇచ్చేది అప్పుడే