Kubera Glimpse Released : శేఖర్ కమ్ముల టేకింగ్‌లో సినిమా అంటే రొటీన్ ఎలిమెంట్స్‌కు భిన్నంగా, బలమైన భావోద్వేగాలతోనే కథను ఆడియన్స్‌కు కనెక్ట్ చేయడం. మరి అలాంటి డైరెక్టర్ డబ్బు చుట్టూ సాగే ఓ థ్రిల్లర్ కథను తెరకెక్కిస్తున్నాడు అంటే కచ్చితంగా ఏదో కొత్తగా ఉండబోతుందనే ఆలోచన సినీ ప్రియుల మదిలో మెదిలింది. తాజాగా అందుకు తగ్గట్టే 'కుబేర' గ్లింప్స్‌ను విడుదల చేసి ఆకట్టుకున్నారు శేఖర్ కమ్ముల. సినిమాలోని నటులు, వారి భిన్న పరిస్థితులను ప్రెజెంట్ చేస్తూ, ఒక్క డైలాగు కూడా లేని గ్లింప్స్‌ను అందించారు.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్- అక్కినేని నాగార్జున లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న ఈ 'కుబేర'ను శేఖర్ కమ్ముల పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మరో కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే సినిమా నుంచి వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల అవ్వగా అవి సినీ ప్రియుల్లో ఆసక్తిని రేపాయి.
ఈ క్రమంలోనే తాజాగా కుబేర ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నాం అంటూ ప్రచార చిత్రాన్ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ధనుశ్, నాగార్జున, రష్మిక పాత్రలను చాలా ఇంటెన్సివ్‌గా చూపించారు. అయితే వీరు ప్రచార చిత్రంలో కేవలం కనిపించడం మాత్రమే కాదు, రకరకాల భావోద్వేగాలు తమ ముఖాల్లో చూపిస్తూ కనిపించారు. ఇంకా ఈ గ్లింప్స్‌కు దేవీశ్రీ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది. గ్లింప్స్‌లో ఎటువంటి డైలాగులు లేకపోయినా దాని లోటు కనిపించలేదు. మొత్తంగా మనుషులు, డబ్బు - వీటి చుట్టూ ఉండే భావోద్వేగాలను ఇందులో చూపించారు.
ఇకపోతే ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్‌గా తమిళం, తెలుగులో ఒకేసారి షూటింగ్ చేస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. నికేత్ బొమ్మి ఛాయాగ్రహణం బాధ్యతలు చూసుకుంటున్నారు. సినిమాను తెలుగుతోపాటు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు.
'కంగువా' డైరెక్టర్ శివ నెక్ట్స్ సినిమా - ఆ స్టార్ హీరోతోనే!
మలయాళ డైరెక్టర్‌తో నాని కొత్త మూవీ! - నేచురల్ స్టార్ లైనప్‌లో ఎన్ని సినిమాలంటే?