విశ్వాస ఘాతుకానికి సీఎం జగన్ ట్రేడ్ మార్క్: లంకా దినకర్ - Lank Dinakar Fires On Cm Jagan
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 30, 2024, 4:05 PM IST
Lank Dinakar Fires On Cm Jagan : సీఎం జగన్ విశ్వాస ఘాతుకానికి ట్రేడ్ మార్క్ లాంటివారని బీజేపీ నేత లంకా దినకర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఐదేళ్లగా అరాచక పాలన సాగుతోందని ఆరోపించారు. రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే కూటమి అధికారంలోకి రావాలన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ మూడు రాజధానులంటూ మద్యం, గంజా, మాదకద్రవ్యాలు రాజధానులుగా చేశారు. బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు.
ఒకసారి వైఎస్సార్సీపీ (YSRCP) ఓటు వేస్తే రాష్ట్రం రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్లిపోయిందని ధ్వజమెత్తారు. ఇప్పుడు మరోసారి ఓటు వేస్తే రాష్ట్రం ఈ శతాబ్ధం వెనక్కి పోతుందని ఆయన విజయవాడ బీజేపీ (BJP) రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. రాష్ట్రంలో మోదీ మార్క్ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడు కలబోతే జగన్మోహన రెడ్డి అని ఆరోపించారు. బీజేపీ, టీడీపీ (TDP), జనసేన (Janasena) త్రిమూర్తుల కలయికతో రాష్ట్రంలో రాక్షస సంహారం తథ్యమన్నారు.