రహదారులు లేక విద్య, వైద్యం, విద్యుత్ వంటి సౌకర్యాలు లేవు : గిరిపుత్రులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 26, 2024, 3:02 PM IST
Lack Road Facility in Tribal Areas in Anakapalli District : ఎంతోకాలంగా నివాసాలు ఏర్పరచుకొని జీవనం సాగిస్తున్నప్పటికీ తమను గిరిజనులుగా గుర్తించడంలో పాలకులు విఫలం అయ్యారని పేర్కొంటూ అనకాపల్లి జిల్లా ఆదివాసులు నిరసన వ్యక్తం చేశారు. రోలుగుంట మండలం గిరిజన పంచాయతీకి చెందిన పలువురు డోలి మోతలతో ఆందోళన చేశారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని 75 వసంతాలు గడుస్తున్నా తమ జీవితాల్లో ఎలాంటి మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం డోలి మోతలతో చిన్నారులు, రోగులు, గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
గిరిజన గ్రామాలకు కనీస రహదారి సదుపాయం లేకపోవడంతో విద్య, వైద్యం, విద్యుత్ వంటి సౌకర్యాలకు నోచుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ కష్టాలను గుర్తించి గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నర్సీపట్నంలో ఐటీడీఏ ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందరాజులతో పాటు పలువురు గిరిజన నాయకులు పాల్గొన్నారు.