ఏళ్లుగా పెండింగ్లో ఉన్న లేండి ప్రాజెక్టు పూర్తయ్యేలా కృషి చేస్తాం : కోదండరాం
Published : Jan 23, 2024, 10:22 PM IST
Kodandaram Visit Lendi Project : లేండి ప్రాజెక్టును పూర్తిచేసేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. ఇవాళ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం నుంచి మహారాష్ట్రలోని లేండి ప్రాజెక్టును సందర్శించారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టు పనులు ఎంతవరకు వచ్చాయని అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు మొత్తం కాలినడకన తిరిగి ఆయన సందర్శించారు. పనులు ఎందుకు నిలిచిపోయాయి? ప్రాజెక్టు నీటి సామర్థ్యం, గేట్లు, మహారాష్ట్ర, తెలంగాణ వాటాతో పాటు ఇప్పటి వరకు ఎంత మేరకు పనులు పూర్తి చేశారని ఆరా తీశారు. తెలంగాణలో ప్రాజెక్టు ప్రధాన కాలువల పరిస్థితి ఏంటి అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Kodandaram about Lendi Project : గత పాలకుల నిర్లక్ష్యంతో ప్రాజెక్టు పూర్తి కాలేదని కోదండరాం ఆరోపించారు. ప్రాజెక్టు పూర్తి చేస్తే మద్నూర్, బిచ్కుంద మండలాలలో 22 వేల ఎకరాలు సాగులోకి వస్తుందని గుర్తు చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం లేండి ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో తాము కూడా మిత్రపక్షంగా ఉన్నామని ఇరిగేషన్ మంత్రితో మాట్లాడి లేండి ప్రాజెక్టు పనులు పూర్తిచేసేలా కృషి చేస్తామన్నారు. అంతకు ముందు కోదండరాం మద్నూర్ మండలం మహారాష్ట్ర సరిహద్దును ఉన్న సలాబాత్ పూర్ ఆంజనేయస్వామిని దర్శించుకుని పూజలు చేశారు.