గ్రంధి నివాసంలో ఐదో రోజూ కొనసాగుతున్న ఐటీ దాడులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 10, 2024, 3:53 PM IST
IT Raids On YCP Ex MLA Grandhi Srinivas House For The Fifth Day : వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో ఐదో రోజూ IT అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని గ్రంధి ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. 5 రోజుల క్రితం చెన్నై నుంచి వచ్చిన ఐటీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. గ్రంధి శ్రీనివాస్ ఇంటితోపాటు ఆయన అనుచరుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో వరుసగా సోదాలు జరుగుతుండటంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రకాశం జిల్లాలో కూడా గ్రంధికి సంబంధించిన సంస్థల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో నగదుతో పాటు కీలక డాక్యుమెంట్లు కూడా లభించినట్లు సమాచారం.
గ్రంధి శ్రీనివాస్ 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున భీమవరం నుంచి పోటీచేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విజయం సాధించారు. అలాగే 2024 ఎన్నికల్లో భీమవరం నుంచి బరిలో దిగిన గ్రంధి కూటమి అభ్యర్థి పులివర్తి రామాంజనేయులు చేతిలో ఓడిపోయారు. ఓటమి తర్వాత గ్రంధి వైఎస్సార్సీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గ్రంధి ఆ పార్టీని వీడతారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఐటీ సోదాలు కలకలం రేపాయి.