వరద బాధితులకు ఈనాడు ఆపన్నహస్తం - సూర్యాపేటలో నిత్యావసరాల పంపిణీ - EENADU HELPS FLOOD VICTIMS - EENADU HELPS FLOOD VICTIMS
Published : Sep 5, 2024, 10:27 PM IST
EENADU HELPS FLOOD VICTIMS : వరద ముంపుతో సర్వం కోల్పోయిన బాధితులకు రామోజీ గ్రూప్ సంస్థ ఆపన్నహస్తం అందించింది. గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని తొగర్రాయి, కూచిపూడి గ్రామస్థులు సర్వం కోల్పోయారు. తొగర్రాయి, కూచిపూడి గ్రామాల్లో ఎగువన ఉన్న నారాయణపురం చెరువు కట్ట తెగి హఠాత్తుగా గ్రామంలోకి వరద నీరు వచ్చి చేరింది. వరద బీభత్సంతో పలు ప్రాంతాల్లోని ఇల్లు నేలమట్టం అయ్యాయి.
ఇళ్లలో ఉన్న నిత్యవసరాలు తడిసి తినడానికి తిండి లేక, ఉండడానికి ఇళ్లు లేక కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలో బాధిత కుటంబాలకు ఈనాడు అండగా నిలిచింది. ఈనాడు - మీతోడు ఆధ్వర్యంలో బాధితులకు నిత్యవసరాల కిట్లను పంపిణీ చేశారు. 8 కేజీల బియ్యంతో పాటూ రెండు కిలోల కందిపప్పు, చింతపండు, చక్కెర, టీపొడి, ఉప్పు, నూనె, కారం, పసుపు, దుప్పటితో కూడిన 500 కిట్లను పంపిణీ గ్రామస్థులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సూర్యాపేట యూనిట్ మేనేజర్ రమాకాంత్, ఈనాడు ఈటీవీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.