మహబూబాబాద్‌లో మందు బాబుల హల్‌చల్ - పాతకక్షలతో బిర్యానీ సెంటర్‌పై దాడి - Drunkers Attack On Biryani Centre
Published : Mar 4, 2024, 9:26 AM IST
Drunkers Hulchul In Mahabubabad : మందు బాబుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. మద్యం సేవించి రోడ్డుపై హల్‌చల్ చేస్తూ ప్రజలకు, పోలీసులకు తలనొప్పిగా మారుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో మద్యం మత్తులో మందు బాబులు బిర్యానీ సెంటర్‌పై దాడి చేసి రచ్చరచ్చ చేశారు.
దంతాలపల్లికి చెందిన ముగ్గురు యువకులు పాతకక్షల కారణంగా ఓ బిర్యానీ కేంద్రానికి వెళ్లి దాడికి పాల్పడ్డారు. అడ్డు వచ్చిన వారిని తోసి వేశారు. ఈ కారణంగా మండలం కేంద్రంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకుని గొడవను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు సర్దిచెప్పినా వినకపోవడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు.
మద్యం మత్తులో ఉన్న ముగ్గురిని ఠాణాకు తరలించడంతో బాధిత కుటుంబాలు తమ వారిని ఎస్సై తీవ్రంగా కొట్టారని స్టేషన్ ముందు గొడవకు దిగారు. సమాచారం అందుకున్న తొర్రూర్ డీఎస్పీ సురేశ్ అక్కడికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు. తమ విధులకు ఆటంకం కలిగించారని బాధ్యులైన ముగ్గురు మందుబాబులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కరుణాకర్ తెలిపారు.