బడ్జెట్ పేరుతో ఎన్నికల ప్రసంగం: సీపీఐ రామకృష్ణ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 1, 2024, 5:01 PM IST
CPI Ramakrishna Respond on Central Budget: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ స్పందించారు. బడ్జెట్ పేరుతో చేసిన ఎన్నికల ప్రసంగమని రామకృష్ణ వ్యాఖ్యానించారు. స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి చెత్త బడ్జెట్‌ను గతంలో ఎన్నడూ చూడలేదని దుయ్యబట్టారు. గత పదేళ్లలో అభివృద్ధి చేశామని చూపించిన లెక్కలకు, వాస్తవాలకు ఏ మాత్రం పొంతన లేదని విమర్శలు గుప్పించారు. వచ్చే ఐదేళ్లలో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించబోతుందని నిర్మలా చెప్పుకోవడం ఎన్నికల ర్యాలీల్లో చేసిన ప్రసంగంలా ఉందని ఎద్దేవా చేశారు.
ప్రధాని మోదీ ప్రసంగంలో తరచూ 'డెమోక్రసీ, డెమోగ్రఫీ, డైవర్సిటీ’ వంటి పదాలను వింటూనే వున్నామని కానీ, ఏనాడూ వాటి అర్థాలకు అనుగుణంగా మోదీ పాలన లేదంటూ రామకృష్ణ విమర్శించారు. పది సంవత్సరాల్లో ఎంత మంది యువకులకు ఉద్యోగాలు కల్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వంలో మహిళలు ఏ మేరకు అభివృద్ధి చెందారో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్మలా పేర్కొన్నట్లుగా, రైతులు, మహిళలు, యువకులు ఎవ్వరూ అభివృద్ది చెందలేదని తెలిపారు. మోదీ ప్రభుత్వంలో కేవలం అదానీ, అంబానీలు మాత్రమే లబ్ధి పొందారని విమర్శించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక గుణాత్మక మార్పులు వచ్చాయని చెప్పుకోవడం సిగ్గుచేటని రామకృష్ణ విమర్శించారు.