భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
Published : Mar 11, 2024, 2:40 PM IST
CM Revanth Visits Bhadradri Temple : భద్రాద్రి సీతారామచంద్ర స్వామిని సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో సారపాక చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం వెళ్లారు. ముఖ్యమంత్రికి ఆలయ ఈవో, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లకు రేవంత్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వారికి వేదాశీర్వచనం పలికారు. అదేవిధంగా భద్రాద్రి ఆలయ అభివృద్ధిపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం రేవంత్‌రెడ్డి భద్రాచలం మార్కెట్ యార్డులో సుమారు 5,000ల మంది మహిళల సమక్షంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అక్కడినుంచి సాయంత్రం మణుగూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభా వేదిక నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరిస్తారు.