పిల్లల్ని ఎత్తుకెళ్తున్నాడనే అనుమానంతో దాడి - పశువుల కాపరి మృతి - Nizamabad news
Published : Feb 12, 2024, 7:50 PM IST
Cattle Shepherd Died in Villagers Attack in Nizamabad : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మి ఓ పశువుల కాపరిని కాటికి పంపారు. ఈ ఘటన పట్టణంలోని గాయత్రీ నగర్లో ఉదయం 7:30లకు అనుమానంగా తిరుగుతున్న వ్యక్తిని పిల్లలను ఎతుకెల్లే వాడని అనుమానించి ఆ వ్యక్తిపై విచక్షణా రహితంగా కాలనీ వాసులు కర్రలతో దాడి చేశారు.
దాడిలో బాధితుడు రెండు చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గాయపడిన వ్యక్తిని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వ్యక్తి ఉదయం 10 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు ఖానాపూర్ చెందిన పశువుల కాపరి హిజ్రా బర్ల రాజుగా గుర్తించారు. దాడి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిన్న పిల్లల కిడ్నాప్లపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న దుష్ప్రప్రచారాలను నమ్మి అనవసర దాడులు చేయరాదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కిడ్నాపర్ల గ్రూపులు తిరుగుతున్నారని అసత్య ప్రచారాలు చేస్తూ అమాయకులపై దాడులు చేయడం సరికాదన్నారు. జిల్లాలో ఎలాంటి కిడ్నాపర్ గ్రూపులు ప్రవేశించలేదని స్పష్టం చేశారు. అనుమానితులు కనిపిస్తే పోలిసులకు సమాచారం ఇవ్వాలని, ఇలాంటి దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.