రఘునందన్‌కు ఓటు వేసినట్లయితే నీళ్లు లేని బావిలో దూకినట్లే : హరీశ్‌రావు - Harish Rao fires On Congress BJP
Published : May 8, 2024, 8:43 PM IST
Harish Rao fires On Congress BJP : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పాలన రివర్స్ గేర్‌లో సాగుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌పై బురద చల్లే నెపంతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చూపిస్తున్నారని, దీంతో రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని శివానుభవ మండపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు.
6 గ్యారంటీలు అమలు చేయలేక రాష్ట్రం దివాలా తీసిందని చెప్పడంతో, రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందన్నారు. తన ప్రాణం ఉన్నంతవరకు సిద్దిపేట జిల్లాను రద్దు చేయనీయనని తెలిపారు. సిద్దిపేటకు సేవ చేస్తానని తెలిపారు.ఫేక్ ప్రచారాలు చేయడంలో బీజేపీ అభ్యర్థి దిట్ట దయచేసి వాటిని నమ్మవద్దని కోరారు. దుబ్బాకకే ఏమీ చేయని రఘునందన్‌రావు సిద్దిపేటలో చేస్తారని నమ్మకమేంటని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఎంపీగా పోటీచేస్తున్న వెంకటరామిరెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేసే పరిస్థితి లేదని అర్థమవుతుందన్నారు. రఘునందన్‌కు ఓటు వేసినట్లయితే నీళ్లు లేని బావిలో దూకినట్లేనని హరీశ్‌రావు అభివర్ణించారు.