బొలెరో డ్రైవర్‌కు హార్ట్ ఎటాక్! భక్తులపైకి దూసుకెళ్లిన వాహనం- ఇద్దరు మృతి - nagaur road accident
Published : Feb 22, 2024, 5:24 PM IST
Bolero Accident In Nagaur : రాజస్థాన్‌లో విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న భక్తులపైకి ఓ బొలెరో వాహనం దూసుకువెళ్లిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉద్రిక్తతలు తలెత్తడం వల్ల పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.
ఇదీ జరిగింది
నాగౌర్ జిల్లాలో విశ్వకర్మ జయంతి వేడుకల సందర్భంగా శోభాయాత్రను నిర్వహించారు. ఈ క్రమంలో అటువైపుగా వెళ్తున్న బొలెరో వాహనం డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు రావడం వల్ల కారు అదుపుతప్పి ప్రజలపైకి దూసుకువెళ్లిందని తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. గాయపడ్డవారిని స్థానికులు దగ్గర్లోని దెగనా ఆసుపత్రిలో చేర్పించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఆ ముగ్గురిని మెరుగైన చికిత్స నిమిత్తం అజ్మేర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద గురించి తెలిసి వందలాది సంఖ్యలో ప్రజలు ఆసుపత్రి దగ్గరకు చేరుకున్నారు. ఆసుపత్రి వద్ద నిరసన తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.