పెద్దోళ్ల పంచాయతీ మధ్య చిన్నోళ్లను బలి చేయవద్దు : అక్బరుద్దీన్ ఓవైసీ - అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీ
Published : Feb 17, 2024, 6:50 PM IST
Akbaruddin Owaisi on Kaleshwaram Project Issue : రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులు ఏటీఎంలుగా మారాయని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వ వైఖరి ఏమిటని ప్రశ్నించిన ఆయన, నీటి కేటాయింపులు, లభ్యత ఉన్నాయా అని అడిగారు. నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. వర్షాకాలం లోపు మేడిగడ్డను పునరుద్దరించాలని కోరిన అక్బరుద్దీన్ ఓవైసీ, కాళేశ్వరం లోటుపాట్లపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షం సైతం విచారణ కోరినట్లు హరీశ్‌రావు చెప్పారని గుర్తు చేశారు.
పెద్దోళ్ల పంచాయతీ మధ్య చిన్న వారిని బలి చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు, పార్టీల గొడవలకు ఇంజినీర్లు, అధికారులను బలి చేయటం తగదన్నారు. ఏపీలో ప్రాజెక్టులు వృధాగా పడి ఉన్నాయన్నారు. నీటి లభ్యత, విద్యుత్‌లపై సాధ్యాసాధ్యాలు, వినియోగంపై ఎప్పుడూ చర్చ జరగలేదని, వాటిపై చర్చ జరగాలని కోరారు. ఎత్తిపోతల పథకాలకు అవసరమైన విద్యుత్ రాష్ట్రంలో ఉందా అని ప్రశ్నించారు. లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ ఏ మేరకు ప్రయోజనం ఉంటుంది? రైతులకు ఎంత లబ్ది చేకూరుతుందో బేరీజు వేయాలని సూచించారు.