నిబంధనలకు విరుద్దంగా రాప్తాడులో జగన్ సభ- టీడీపీ సభలకు అనేక ఆంక్షలు : అచ్చెన్నాయుడు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 17, 2024, 6:22 PM IST
Achchennaidu Mentioned No Rule of Law in the State : రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. వైసీపీ సభలకు నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు. టీడీపీ సభలకు నిబంధనలకు అనుగుణంగా అనుమతులు నిరాకరిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు, ఉద్యోగసంఘాలు, ప్రజాసంఘాల కార్యక్రమాలకు అడ్డంకులు, హౌస్ అరెస్టులు చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ సభలకు వారం ముందు నుంచే ఆంక్షలు పెట్టి ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు.
ఫిబ్రవరి 18న రాప్తాడులో జగన్ సభకు హైవే ప్రక్కన నిబంధనలకు విరుద్ధంగా అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. సభకు వారం ముందు నుంచే హైవే పై రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధిస్తున్నారని ఆక్షేపించారు. రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ లకు తీసుకెళ్లలేని పరిస్థితులను సీఎం జగన్ మోహన్ రెడ్డి కల్పించారని వ్యాఖ్యానించారు. వైసీపీ ఆగడాలు ఇంకెంత కాలమో సాగవు, వాళ్లకు కౌంట్ డౌన్ మొదలైందని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.