WhatsApp Video Call Features :ఇప్పుడు వాట్సాప్ ప్రజల జీవితాల్లో ముఖ్య భాగం అయిపోయింది. వాట్సప్ కాలింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తరువాత కమ్యూనికేషన్ వ్యవస్థలో పెద్ద మార్పే వచ్చింది. ఇప్పటికీ వాయిస్ కాల్స్, వీడియో కాల్స్‌కు సంబంధించి వాట్సప్ కొత్త కొత్త ఫీచర్స్‌ను తీసుకువస్తూనే ఉంది. ఇప్పుడు గూగుల్ మీట్, జూమ్‌లకు పోటీగా వీడియో కాలింగ్‌లో 3 సరికొత్త ఫీచర్లను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.
స్క్రీన్ షేరింగ్ :
వాట్సాప్ కాల్‌లోనే స్క్రీన్ షేరింగ్ చేసుకొనేలా వాట్సాప్ అప్డేట్ తీసుకువస్తోంది. ప్రస్తుతానికి ఇది బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. గూగూల్ మీట్, జూమ్‌లకు పోటీగా వాట్సాప్ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఈ స్క్రీన్ షేరింగ్ ఫీచర్‌తో, మీరు వీడియో కాల్ కొనసాగిస్తూనే సినిమాలను, లేదా వీడియో కంటెంట్‌ను మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయడానికి వీలవుతుంది.
గ్రూప్ వీడియో కాల్
వాట్సాప్ ఇప్పుడు గ్రూప్ వీడియో కాల్‌లో కూడా గణనీయమైన అప్డేట్ను తీసుకువచ్చింది. ఈ ఫీచర్‌తో గ్రూప్ వీడియో కాల్‌లో ఒకేసారి 32 మందితో మాట్లాడవచ్చు. సింపుల్‌గా చెప్పాలి అంటే మీరు ఇప్పుడు డెస్క్‌టాప్‌తో పని లేకుండా ఒకే వీడియో కాల్‌లో ఎక్కువ మంది స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా సహోద్యోగులతో సమావేశం కావచ్చు.
స్పీకర్ స్పాట్‌లైట్ :
గ్రూప్ కాల్‌లో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవటం కష్టం. కానీ త్వరలో ప్రవేశపెడుతున్న 'స్పీకర్ స్పాట్‌లైట్' ఫీచర్ వల్ల, మాట్లాడుతున్న వ్యక్తి ఆటోమేటిక్‌గా హైలైట్ అయ్యి, స్క్రీన్‌పై మొదట కనిపిస్తాడు. దీంతో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా, అందరూ సులువుగా మాట్లాడే వ్యక్తిని గుర్తించవచ్చు.