Whatsapp Added New Features:వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్. ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు వినియోగదారులకు చాట్‌లోనే నేరుగా వీడియోలు, ఫొటోలను ఎడిట్ చేసేందుకు 30 రకాల విజువల్ ఎఫెక్ట్‌లను అందిస్తోంది.
అంతేకాక యాప్ నుంచి బయటకు వెళ్లకుండానే నేరుగా ఇందులో నుంచే స్టిక్కర్ ప్యాక్‌లను షేర్ చేసేందుకు, సెల్ఫీల నుంచి స్టిక్కర్స్‌ను క్రియేట్ చేసేందుకు సరికొత్త యాప్ ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ యాప్ రియాక్షన్ ఫీచర్‌ను కూడా మెరుగుపరించింది. ఈ సందర్భంగా ఈ కొత్త ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం రండి.
వాట్సాప్‌లోకి కొత్త ఫీచర్లు ఇవే!:
కెమెరా ఎఫెక్ట్స్:వాట్సాప్ గతేడాది అక్టోబర్‌లో వీడియో కాల్స్ కోసం కొత్త ఫిల్టర్స్, బ్యాక్గ్రౌండ్స్, ఎఫెక్ట్‌లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు వాట్సాప్ కెమెరాను ఉపయోగించి తీసిన వీడియోలు, ఫొటోలకు కూడా వీటిని అందిస్తోంది. దీంతో వినియోగదారులు వాట్సాప్‌లో తీసిన ఫొటోలు, రికార్డ్ చేసిన వీడియోలకు 30 ఫిల్టర్లు, బ్యాక్గ్రౌండ్స్, ఎఫెక్ట్‌లను నేరుగా యాప్‌లోనే ఉపయోగించొచ్చు.
సెల్ఫీ స్టిక్కర్లు:వాట్సాప్ ఏదైనా సెల్ఫీని కస్టమ్ స్టిక్కర్‌గా మార్చే ఫెసిలిటీని ఇప్పుడు అందిస్తోంది. ఇందుకోసం యాప్‌లోని కెమెరాను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇందుకోసం వినియోగదారులు స్టిక్కర్స్ ట్యాబ్‌కి వెళ్లి క్రియేట్ స్టిక్కర్ ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి. అప్పుడు ఇది వాట్సాప్ కెమెరాను ఓపెన్ చేసి వినియోగదారులు సెల్ఫీ తీసుకొని దానిని స్టిక్కర్‌గా మార్చడానికి అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ఇప్పటికే ఆండ్రాయిడ్‌లో అందుబాటులో ఉంది. త్వరలో ఇది iOSలో కూడా అందుబాటులోకి రానుంది.