Lock Down Mode Android : ప్రస్తుత కాలంలో ఆండ్రాయిడ్ యూజర్లపై సైబర్ దాడులు పెరిగిపోయాయి. ఫోన్లో ఉన్న పర్సనల్ డేటా, ఫైల్స్, బ్యాంకు అకౌంట్ వివరాలను సైబర్ నేరగాళ్లు చోరీ చేస్తున్నారు. అకౌంట్లలోని నగదును కొల్లగొడుతున్నారు. అయితే ఆండ్రాయిడ్ యూజర్ల కోసం పటిష్ఠమైన భద్రతా ఫీచర్ ఒకటి ఉంది. అదే ఆండ్రాయిడ్ లాక్డౌన్ మోడ్. ఈ ఫీచర్ సైబర్ దాడుల నుంచి యూజర్ల డేటాకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. సాధారణంగా పిన్ నంబర్, పాస్ వర్డ్, ప్యాటర్న్ తెలియకపోతే ఎవరూ మీ ఫోన్‌ను ఉపయోగించలేరు. అలాగే అందులోని డేటాను చోరీ చేయలేరు. కానీ ఈ లాక్డౌన్ మోడ్‌ను ఆన్ చేస్తే ఆ వివరాలన్నీ తెలిసినా ఫోన్ ఓపెన్ చేయలేరు. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేయగానే వెంటనే బయోమెట్రిక్ అన్‌లాక్ విధానాలను అన్ని ఆటోమెటిక్ ఆఫ్ అయ్యి మీ ఫోన్ సురక్షితంగా ఉంటుంది. అందుకే మీ ఫోన్లోని డేటాను మరింత భద్రంగా ఉంచుకునేందుకు లాక్డౌన్ మోడ్‌ను ఎలా యాక్టివేట్ చేయాలి? అది ఎలా పనిచేస్తుంది? తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా అందరూ ఫోన్‌కు పిన్, పాస్ వర్డ్, ప్యాటర్న్‌ను పెట్టుకుంటారు. వాటిలో ఏదో ఒక దాన్ని ఉపయోగించి ఫోన్‌ను అన్‌లాక్ చేస్తారు. మీ ఫోన్‌ను ఇతరులెవరైనా దొంగిలించినా వీటి గురించి తెలియకపోతే అన్‌లాక్ చేయలేరు. ఇంకొందరు ఫోన్ సెన్సార్‌పై బయోమెట్రిక్, కెమెరాపై ఫేస్ రికగ్నజిషన్ ద్వారా ఫోన్‌ను మరింత వేగంగా అన్ లాక్ చేసుకుంటుంటారు. అయితే ఫోన్‌ను దొంగిలించాలనుకున్నవారు మీ ఫింగర్ ప్రింట్, పేస్ రికగ్నైజేషన్ ద్వారా అందులోని డేటాను చోరీ చేయవచ్చు. కానీ, లాక్డౌన్ మోడ్ నాలెడ్జ్ బేస్డ్ అథెంటికేషన్‌తో(KBA) వస్తుండడం వల్ల ఫోన్లోని డేటా చోరీ కాకుండా కాపాడుకోవచ్చు. ఈ లాక్డౌన్ మోడ్ మీ ఫోన్ లాక్ స్క్రీన్‌పై నోటిఫికేషన్లను సైతం హైడ్ చేస్తుంది. తద్వారా సైబర్ నేరగాళ్లు మీ ఫోన్లోని టెక్ట్స్ మెసేజ్, ఇతర వ్యక్తిగత డేటాను చూడలేరు. లాక్డౌన్ మోడ్ వల్ల సైబర్ కేటుగాళ్లు వాయిస్ రికగ్నైజేషన్ ద్వారా కూడా మీ మొబైల్లోని డేటాను కొల్లగొట్టలేరు.