Satya Nadella on Microsofts Biggest Mistake:'సెర్చ్' ఇంజిన్ ఆధిపత్యాన్ని అంచనా వేయడంలో విఫలమవడం తమ కంపెనీ చేసిన అతిపెద్ద మిస్టేక్ అని మైక్రోసాఫ్ట్ సీఈవో అన్నారు. అయితే గూగుల్ మాత్రం ఈ విషయాన్ని ముందుగానే గుర్తించి పెట్టుబడులు పెట్టి విజయవంతంగా ఈ మార్కెట్లో తన హవా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ అత్యంత విలువైన దానిని మిస్ అయిందని, అయితే గూగుల్ మాత్రం 'డొమినెన్స్ ఆఫ్ సెర్చ్' సామర్థ్యాన్ని గుర్తించి చక్కగా అమలు చేసిందని సత్య నాదెళ్ల పేర్కొన్నారు.
మైక్రోసాఫ్ట్ సంస్థ మొదట్లో 'వెబ్' వికేంద్రీకృతమై ఉంటుందని భావించిందని, అయితే 'సెర్చ్' దాని అత్యంత విలువైన బిజినెస్ మోడల్‌గా మారుతుందని గ్రహించలేదని ఆయన అన్నారు. దీన్ని ఒక విలువైన పాఠంగా పేర్కొంటూ.. "వెబ్‌లో అతిపెద్ద బిజినెస్ మోడల్‌గా మారిన దానిని మేం (మైక్రోసాఫ్ట్) కోల్పోయాం. ఎందుకంటే 'వెబ్' ఎక్కువగా విస్తరిస్తుందని మేమంతా భావించాం" అని ఆయన అన్నారు.
యూట్యూబర్ ద్వారకేష్ పటేల్‌తో జరిగిన సంభాషణలో.. గూగుల్ 'సెర్చ్' ఇంజిన్ సామర్థ్యాన్ని గుర్తించి తన స్ట్రాటజీని ఫ్లోలెస్గా అమలు చేస్తున్న సమయంలో, మైక్రోసాఫ్ట్ సంస్థ సెర్చ్ ప్రాముఖ్యతను ఎలా తప్పుగా అంచనా వేసిందో నాదెళ్ల వివరించారు. "వెబ్‌ను నిర్వహించడంలో 'సెర్చ్' బిగ్గెస్ట్ విన్నర్ అవుతుందని ఎవరనుకున్నారు?.. మేము దానిని సరిగ్గా చూడలేదు.. అయితే గూగుల్ మాత్రం ఇది పసిగట్టి అవకాశాన్ని ఒడిసిపట్టుకుని దాన్ని బాగా అమలు చేసింది" అని నాదెళ్ల పేర్కొన్నారు.
ఈ క్రమంలో కంపెనీలు సాంకేతిక మార్పును అర్థం చేసుకోవడం మాత్రమే సరిపోదని, వాల్యూ క్రియేషన్ ఎక్కడ జరుగుతుందో కూడా గుర్తించాలని ఆయన వివరించారు. బిజినెస్ మోడల్స్‌లో మార్పులకు అనుగుణంగా ఉండటం.. తరచుగా సాంకేతిక పురోగతిని కొనసాగించడం కంటే చాలా సవాలుతో కూడుకున్నదని ఆయన గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ బిజినెస్ మోడల్స్ షిఫ్ట్స్ అనేవి టెక్ ట్రెండ్ కంటే కూడా కఠినమైనవని ఆయన పేర్కొన్నారు.