Vayve Eva Electric Car Launched: మన ఇండియన్ మార్కెట్లో మొట్టమొదటి సోలార్ కారు లాంఛ్ అయింది. దీన్ని పుణెకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ వేవ్ మొబిలిటీ (Vayve Mobility) భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025లో విడుదల చేసింది. 'వేవ్ ఎవా' పేరుతో తీసుకొచ్చిన సౌరశక్తితో నడిచే ఈ ఎలక్ట్రిక్ కారు (EV)ను కంపెనీ రూ. 3.25 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో తీసుకొచ్చింది.
ఈ సౌరశక్తితో నడిచే కారు బుకింగ్స్ మార్కెట్లో ప్రారంభమయ్యాయి. దీన్ని బుక్ చేసుకోవాలంటే రూ. 5,000 అడ్వాన్స్ అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే 'వేవ్ ఎవా' డెలివరీలు 2026 సెకండ్ హాఫ్ నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. ఈ కారును ముందుగా బుక్ చేసుకున్న మొదటి 25,000 మంది కస్టమర్లకు అదనపు ఫీచర్లను అందిస్తామని కూడా పేర్కొంది. వీటిలో ఎక్స్టెన్డెడ్ బ్యాటరీ వ్యారెంటీ, 3 సంవత్సరాల ఉచిత వాహన కనెక్టివిటీ వంటి సదుపాయాలు ఉన్నాయి.
బ్యాటరీ ప్యాక్స్: కంపెనీ ఈ కారును మూడు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో తీసుకొచ్చింది.
- 9 kWh
- 12 kWh
- 18 kWh
దీని అతి పెద్ద బ్యాటరీ ప్యాక్ కలిగిన వేరియంట్ ధర రూ. 5.99 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.
వేరియంట్స్:ఈ ఎలక్ట్రిక్ కారు మూడు వేరియంట్లంలో లభిస్తుంది.
- నోవా
- స్టెల్లా
- వేగా
సబ్స్క్రిప్షన్:వేవ్ ఎవా బ్యాటరీ ప్యాక్‌ను కిలోమీటరుకు రూ. 2 చొప్పున సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. దీంతో బ్యాటరీలపై ఎక్కువ మొత్తంలో ప్రారంభ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ సబ్స్క్రిప్షన్ కోసం మినిమమ్ వార్షిక మైలేజ్ ఉంటుంది. ఇది నోవా వేరియంట్‌కు 600 కి.మీ, స్టెల్లా వేరియంట్‌కు 800 కి.మీ, వేగా వేరియంట్‌కు 1200 కి.మీ. అంటే మీరు వాస్తవంగా తక్కువ డ్రైవింగ్ చేసినప్పటికీ ఈ కనీస దూరాలకు కస్టమర్ల నుంచి ఛార్జీ వసూలు చేస్తారన్నమాట.