Online Data Protection Tips :ఇది ఇంటర్నెట్ యుగం. ఇంటర్నెట్ వల్లే డిజిటల్ విప్లవానికి బాటలు పడ్డాయి. ఇప్పుడు నెటిజన్లు ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇంటర్నెట్ బ్రౌజింగ్ గురించి తెలిసిపోయింది. ప్రత్యేకించి సోషల్ మీడియా వినియోగానికి చాలామంది అలవాటుపడ్డారు. ఉదయం నుంచి రాత్రి దాకా ఏదో ఒక సమయంలో యూట్యూబ్ తప్పకుండా చూస్తున్నారు. ఈ తరుణంలో మన బ్రౌజింగ్ సమాచారం ఆయా యాప్‌లు, బ్రౌజర్లలో నిక్షిప్తమై ఉంటుంది. దాన్ని రక్షించుకోవడం ఎలా? 2025 సంవత్సరంలో ఇందుకోసం పాటించదగిన 10 చిట్కాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆన్‌లైన్ సమాచారాన్ని ఏం చేస్తారు ?
మన బ్రౌజింగ్ సమాచారాన్ని తప్పకుండా రక్షించుకోవాలి. లేదంటే దాన్ని దుర్వినియోగం చేసే ముప్పు ఉంటుంది. కొన్ని సంస్థలు మన ఆన్‌లైన్ బ్రౌజింగ్ సమాచారం ఆధారంగా మనకు యాడ్స్ (ప్రకటనలు) చూపిస్తాయి. ఇంకొన్ని సంస్థలు మన ఆసక్తిని గుర్తించి దానికి అనుగుణమైన ప్రకటనలు, కంటెంట్‌ను మనకు సిఫారసు చేస్తాయి. మరికొన్ని సంస్థలు మన వ్యక్తిగత బ్రౌజింగ్ సమాచారాన్ని కూడగట్టి ఇతరత్రా థర్డ్ పార్టీ సంస్థలకు అమ్మేస్తుంటాయి. అలాంటి గుర్తు తెలియని సంస్థలు తప్పుడు ఉద్దేశాల కోసం మన ఆన్‌లైన్ సమాచారాన్ని దుర్వినియోగం చేసే ముప్పు ఉంటుంది. ఇంతకీ మనం వాడే బ్రౌజర్లు, వెబ్‌సైట్లు, యాప్‌లలోకి ఈ సమాచారం ఎలా చేరుతుంది.. అనుకుంటున్నారా ? మరేం లేదు. మనం వివిధ బ్రౌజర్లు, వెబ్‌సైట్లు, యాప్‌లను వినియోగించే క్రమంలో ''షరతులకు అంగీకరించు''(accept) అనే ఆప్షన్ డిస్‌ప్లే అవుతుంటుంది. అక్కడ మనం అంగీకరించు(accept) బటన్‌పై క్లిక్ చేస్తుంటాం. మన బ్రౌజింగ్ సమాచారాన్ని వాళ్లకు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని చెప్పామన్న మాట. ఇక మనం వ్యక్తిగత ఆన్‌లైన్ సమాచారాన్ని రక్షించుకునే చిట్కాల చిట్టా చూద్దాం.
1. అనానిమస్ మోడ్‌లో బ్రౌజ్ చేయండి
గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, సఫారీ ఇలా ఏ ఇంటర్నెట్ బ్రౌజర్ అయినా సరే మనం అనానిమస్ మోడ్(Anonymous Mode)లో వినియోగించాలి. ప్రైవేట్ మోడ్‌లో వినియోగిస్తే మన బ్రౌజింగ్ సమాచారానికి రక్షణ లభిస్తుంది. తద్వారా మనం చూసే వెబ్‌సైట్ల కుకీలు బ్లాక్ అవుతాయి. ఫలితంగా మన వెబ్ బ్రౌజింగ్ హిస్టరీని ట్రాక్ చేయడం కుదరదు. మన బ్రౌజింగ్ సమాచారాన్ని కుకీలు నిక్షిప్తం చేస్తాయి. వాటిలోని సమాచారం ఆధారంగానే మనకు ఇంటర్నెట్‌లో ప్రకటనలను, కంటెంట్‌ను చూపిస్తుంటారు. అనానిమస్ మోడ్‌లో ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తే కుకీల ట్రాకింగ్ బెడద ఉండదు.
2. ప్రైవసీని కాపాడే సెర్చింజన్‌కు మారిపోండి
మీరు నిత్యం వినియోగించే ఇంటర్నెట్ సెర్చింజన్‌కు ఆదాయం ఎలా వస్తోందని ఎప్పుడైనా ఆలోచించారా ? మరేం లేదు.. మీ ఇంటర్నెట్ బ్రౌజింగ్ యాక్టివిటీ ఆధారంగా మీకు తగిన ప్రకటనలను చూపించి గూగుల్ లాంటి ఇంటర్నెట్ సెర్చింజన్‌లు డబ్బులు సంపాదిస్తాయి. మీకు ఆసక్తి ఉన్న అంశాలేవి ? మీరు ఏయే అంశాలపై ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తున్నారు ? అనేది సెర్చింజన్‌కు బాగా తెలుసు. అందుకే దానికి అనుగుణంగా మీ ఎదుటకు కంటెంట్, యాడ్స్‌ను పంపుతుంది. కేవలం విరాళాల ద్వారా నడిచే కొన్ని ఇంటర్నెట్ సెర్చింజన్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగిస్తే మీ ప్రైవసీ(గోప్యత)కు చాలా సేఫ్టీ లభిస్తుంది. DuckDuckGo , Qwant, Startpage వంటివి మీరు పరిశీలించదగిన ఇంటర్నెట్ సెర్చింజన్‌లు.
3. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌లనే ఉపయోగించండి
మెసేజింగ్ యాప్‌ల వినియోగంలో కనీస జాగ్రత్తలు పాటించండి. కొన్ని యాప్‌లు మాత్రమే సేఫ్ అని తెలుసుకోండి. వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రామ్ వంటి యాప్‌ల ద్వారా పంపే మెసేజ్‌లు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్‌గా ఉంటాయి. అందుకే ఈ యాప్స్ సేఫ్. కొన్ని మోసపూరిత మెసేజింగ్ యాప్‌లు ఉంటాయి. అవి మీ మెసేజ్‌లను చదివేస్తాయి. వాటిని మార్కెటింగ్ కంపెనీలకు అమ్మేస్తాయి. అలాంటి వాటితో జాగ్రత్త.
4. వీపీఎన్‌ను ఉపయోగించండి
చాలామంది ఇళ్లలో వైఫై కనెక్షన్లు ఉంటాయి. దాని ద్వారా బ్రౌజింగ్ సేఫ్ అని చాలా మంది భావిస్తుంటారు. వాస్తవానికి వైఫై కనెక్షన్ ఇచ్చిన సంస్థ మీ ఇంటర్నెట్ బ్రౌజింగ్ చరిత్రను నిక్షిప్తం చేస్తుంది. అది తలచుకుంటే దాన్ని థర్డ్ పార్టీకి విక్రయించగలదు. మనదేశంలో డేటా రక్షణ చట్టాలు ఇంకా కఠినతరం కాలేదు. అందువల్ల మన ఆన్‌లైన్ బ్రౌజింగ్ చిట్టాకు గండం ఉంది. ఈ ముప్పు నుంచి గట్టెక్కేందుకు మనం వీపీఎన్ (VPN)ను వినియోగించాలి. వీపీఎన్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్. ఇది మన కోసం ప్రైవేట్ నెట్‌వర్క్‌ను క్రియేట్ చేస్తుంది. వీపీఎన్ ద్వారా మనం చూసే కంటెంట్, బ్రౌజ్ చేసే సైట్ల సమాచారాన్ని థర్డ్ పార్టీ ట్రాక్ చేయలేదు. ExpressVPN, NordVPN, హాట్‌స్పాట్ షీల్డ్, IPVanish వంటి వీపీఎన్ నెట్‌వర్క్‌లను ఎక్కువగా వినియోగిస్తుంటారు.