తెలంగాణ

telangana

ETV Bharat / technology

ఇండియాకు చెందిన శాటిలైట్​ని ప్రయోగించిన స్పేస్​ఎక్స్​- ఇస్రో ఎందుకు లాంచ్ చేయలేదు? రీజన్ ఇదే! - INDIAN SATELLITE SPACEX LAUNCHED

స్పేస్​లోకి దూసుకుపోయిన GSAT-N2 శాటిలైట్‌- అమెరికాలో ఫ్లోరిడా కేప్‌ కెనావెరల్‌ నుంచి ప్రయోగం

Indian Satellite Spacex Launched
Indian Satellite Spacex Launched (IANS File Photo)

By ETV Bharat Tech Team

Published : Nov 19, 2024, 4:14 PM IST

Updated : Nov 20, 2024, 12:04 PM IST

Indian Satellite Spacex Launched: ఎలోన్​ మస్క్​కు చెందిన స్పేస్​ఎక్స్ సంస్థ ఇస్రోకు చెందిన మోస్ట్ అడ్వాన్స్​డ్ కమ్యూనికేషన్ శాటిలైట్​ను అమెరికాలోని ఫ్లోరిడాలో ప్రయోగించింది. మంగళవారం స్పేస్​ఎక్స్​ సంస్థ మన దేశానికి చెందిన ఈ GSAT-N2 శాటిలైట్‌ని అంతరిక్షంలోకి సురక్షితంగా తీసుకెళ్లింది.

అయితే ఈ ప్రయోగంపై చాలామందిలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నో దేశాల శాటిలైట్లను ఇస్రో ప్రయోగిస్తుంది. అయితే ఇస్రోకి చెందిన ఈ శాటిలైట్​ని స్పేస్​ఎక్స్​ ఎందుకు ప్రయోగించింది? దీన్ని ఇస్రో ఎందుకు స్వయంగా ప్రయోగించలేదు? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే ఈ ప్రయోగాన్ని స్పేస్​ఎక్స్​ చేపట్టడం వెనక అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

GSAT-N2 శాటిలైట్‌ని అమెరికా ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్​ నుంచి ప్రయోగించారు. సోమవారం-మంగళవారం అర్ధరాత్రి ఇస్రో అత్యంత అద్భుతమైన కమ్యూనికేషన్ శాటిలైట్​ను స్పేస్​ఎక్స్​కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఈ శాటిలైట్ మారుమూల ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను అందించడంలో, ప్రయాణీకులకు విమానాల్లో ఇంటర్నెట్ సేవలను అందించడంలో సహాయపడుతుంది.

స్పేస్​ఎక్స్-ఇస్రో చేతులు కలిపిన తర్వాత రెండు సంస్థలు కలిపి నిర్వహించిన మొదటి ప్రయోగం ఇది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) ఛైర్మన్, ఎండీ రాధాకృష్ణన్ తెలిపారు. ఈ మేరకు GSAT సరైన కక్ష్యను చేరుకుందని స్పష్టం చేశారు.

GSAT N-2 లేదా GSAT 20 అని పేరుపెట్టిన ఈ కమర్షియల్ శాటిలైట్​ బరువు 4700 కిలోలు. దీన్ని కేప్ కెనావెరల్‌లోని స్పేస్ కాంప్లెక్స్ 40 నుంచి ప్రయోగించారు. ఈ లాంచ్ ప్యాడ్​ను US స్పేస్ ఫోర్స్ నుంచి స్పేస్​ఎక్స్​ లీజుకి తీసుకుంది. అమెరికా అంతరిక్ష ప్రయోజనాలను కాపాడేందుకు 2019లో స్పేస్ఫోర్స్‌ను రూపొందించారు.

అసలేంటీ GSAT-N2 శాటిలైట్?:GSAT-20 శాటిలైట్​ను మారుమూల ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రత్యేకంగా రూపొందించారు. ఈ శాటిలైట్ 48Gpbs వేగంతో ఇంటర్నెట్‌ను అందిస్తుంది. దీంతో ఇది దేశంలోని మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ సర్వీసులను మెరుగుపర్చేందుకు ఉపయోగపడుతుంది.

ఇది అండమాన్-నికోబార్ దీవులు, జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్‌లతో సహా ఇండియాలోని మారుమూల ప్రాంతాలకూ కమ్యూనికేషన్ సేవలను అందిస్తుంది. దీనిలో 32 నారో స్పాట్​ బీమ్స్​ ఉన్నాయి. అందులో 8 బీమ్స్​ నార్త్ ఈస్ట్​ ప్రాంతం, 24 వైడ్ బీమ్స్​ మిగతా దేశాల కోసం. ఈ 32 బీమ్స్​కు ఇండియా భూభాగంలోని హబ్​ స్టేషన్స్ సపోర్ట్ చేస్తున్నాయి.

GSAT-N సామర్థ్యంలో 80 శాతం ప్రైవేట్ కంపెనీ విక్రయించింది. మిగిలిన 20 శాతాన్ని విమానయాన, సముద్ర రంగాలకు చెందిన ప్రైవేట్ కంపెనీలకు విక్రయించనున్నారు. కేంద్రం చేపట్టిన 'స్మార్ట్​ సిటీ' కార్యక్రమానికి ఈ శాటిలైట్ బూస్ట్​ అప్​ను అందిస్తుంది. ఇది విమానంలో ఇంటర్నెట్ కనెక్టివిటీని సౌకర్యవంతంగా చేయడానికి సహాయపడుతుంది.

ఈ శాటిలైట్​ను ఇస్రో ఎందుకు ప్రయోగించలేదు?: స్పేస్​ఎక్స్ ప్రయోగించిన ఈ GSAT-N2 శాటిలైట్​ బరువు 4700 కిలోలు. ప్రస్తుతం మన ఇండియన్ రాకెట్లు 4 టన్నుల కంటే ఎక్కువ బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యాన్ని కలిగి లేవు. ఇస్రోలో అత్యంత పవర్​ఫుల్ రాకెట్ LVM-3 కూడా.. 4000కేజీల బరువున్న శాటిలైట్‌నే మోసుకెళ్లగలదు. దీంతో ఇస్రో ఈ మిషన్ లాంచ్​ కోసం ఎలోన్​ మస్క్​కు చెందిన స్పేస్​ఎక్స్​ సంస్థతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది.

ఇంతకుముందు భారీ ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఇస్రో.. ఫ్రాన్స్‌కు చెందిన ఏరియన్ స్పేస్ కన్సార్టియంపై ఆధారపడింది. ఎలోన్ మస్క్ 2002లో అంతరిక్ష రవాణా సేవల సంస్థ 'స్పేస్​ఎక్స్​'ను స్థాపించారు. లిక్విడ్ ప్రొపెల్లెంట్ రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపిన తొలి ప్రైవేట్ కంపెనీ ఇదే. స్పేస్‌ఎక్స్ 2008లో ఫాల్కన్-1 రాకెట్‌ను ప్రయోగించింది. ఇప్పుడు ఫాల్కన్-9 రాకెట్ ద్వారా ఈ అద్భుతమైన కమ్యూనికేషన్ GSAT-N2 శాటిలైట్​ను ప్రయోగించారు.

ఏంటీ ఫాల్కన్-9 రాకెట్?:ఒక స్టాండర్డ్ ఫాల్కన్-9 B-5 రాకెట్ 70 మీటర్ల పొడవు, 549 టన్నుల బరువు ఉంటుంది. దీన్ని శాటిలైట్ ప్రయోగ సమయంలో లిఫ్ట్​-ఆప్​ కోసం ఉపయోగిస్తారు. రెండు స్టేజ్​లు కలిగిన ఈ రాకెట్​ను మళ్లీ మళ్లీ వినియోగించొచ్చు. ఈ ఫాల్కన్ 9 రాకెట్.. లో ఎర్త్ ఆర్బిట్ (LEO) వరకూ 22,800 కేజీల బరువును మోయగలదు. అదే జియోస్టేషనరీ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (GTO) వరకైతే 8,300కేజీల బరువు క్యారీ చేయగలదు. మొదటి స్టేజ్‌లో ఈ రాకెట్.. 9 మెర్లిన్ ఇంజిన్లను వాడుకుంటుంది. రెండో స్టేజ్‌లో 1 మెర్లిన్ వాక్యూమ్ ఇంజిన్‌ని వినియోగిస్తుంది.

ఈ ఫాల్కన్-9 స్పేస్​ఎక్స్ సంస్థే రూపొందించింది. దీని ద్వారా ఈ సంస్థ పేలోడ్స్, ప్రజలను స్పేస్‌లోకి తీసుకెళ్తోంది. ప్రపంచంలో తిరిగి వాడగలిగే తొలి రాకెట్ తమదే అని స్పేస్​ఎక్స్ చెబుతోంది. అయితే ఇస్రో రాకెట్లు నింగిలోకి వెళ్లాక కాలిపోతూ సముద్రంలో కూలిపోతాయి. అందువల్ల వాటిని తిరిగి వాడట్లేదు.

కర్ణాటకలోని హసన్‌లో ఉన్న ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ ప్రకారం.. "ఈ ఉపగ్రహాన్ని ఒకసారి కక్ష్యలో ఉంచిన తర్వాత మేము దాన్ని కంట్రోల్​లోకి తీసుకుంటాం. ఈ రాకెట్ శాటిలైట్​ను GSAT-N2 భారత్‌కు 36,000 కిలోమీటర్ల ఎత్తులో గమ్యస్థానానికి చేరవేస్తుంది. ఇప్పటివరకు ఫాల్కన్ 9,395 ప్రయోగాలను చేసింది. ఇందులో 4 మాత్రమే ఫెయిల్ అయ్యాయి. ప్రస్తుత ప్రయోగం 99 శాతం విజయవంతమైంది."

విమానంలో ఇంటర్నెట్ రూల్స్: అంతర్జాతీయ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించినప్పుడు అవి ఇంటర్నెట్‌ను షట్​ డౌన్ చేయాలి. ఎందుకంటే భారత్ ఈ సర్వీస్​ను అనుమతించదు. అయితే ఇండియా గగనతలంలోని విమాన ప్రయాణాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ఇటీవల భారత్ నిబంధనలను సవరించింది. కొత్త రూల్స్​ ప్రకారం.. 3 వేల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న విమానం లోపల వై-ఫై సేవలను అందించొచ్చు. అయితే విమానంలో ఎలక్ట్రానిక్ డివైజస్​ను అనుమతించినప్పుడు మాత్రమే ప్రయాణికులు ఈ సేవను ఉపయోగించగలరు.

ఇస్రోతో జతకట్టిన ఐఐటీ మద్రాస్- 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' స్థాపనపై ఒప్పందం

ఇండియా మొట్టమొదటి అనలాగ్ స్పేస్ మిషన్ లాంచ్- ఎక్కడో తెలుసా?

Last Updated : Nov 20, 2024, 12:04 PM IST

ABOUT THE AUTHOR

...view details