Solar Eclipse in 2025:మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. వచ్చే ఏడాదంతా తమకు అంతా మంచే జరగాలని, చేపట్టిన పనులు సవ్యంగా పూర్తి కావాలని అంతా కోరుకుంటారు. ఈ నేపథ్యంలో 2025 కొత్త సంవత్సరం తమకు ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా సూర్య, చంద్ర గ్రహణాల గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. ఎందుకంటే గ్రహణాలకు ఖగోళ దృక్కోణంలో మాత్రమే కాక సనాతన ధర్మంలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది.
అంతరిక్షంలో ఏర్పడే సూర్య, చంద్ర గ్రహణాలు కూడా ఏడాది పొడువునా.. జాతకంపై ప్రభావం చూపుతాయని శాస్త్రం చెబుతోంది. సాధారణంగా హిందూ మతంలో సూర్యగ్రహణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శాస్త్రాల ప్రకారం గ్రహణాలను అశుభకరమైనవిగా పరిగణిస్తారు. సూర్య గ్రహణ సమయంలో ఆలయాల తలుపులు కూడా మూసేస్తారు. ఎందుకంటే ఈ కాలంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ప్రజలు నమ్ముతారు.
ఈ నేపథ్యంలో 2025 కొత్త సంవత్సరంలో ఎన్ని సూర్య గ్రహణాలు ఏర్పడతాయి? అవి మన దేశంలో కన్పిస్తాయా? ఇవి మన దేశంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? సూతక్ కాలం ఎప్పుడు? ఇది మనకు వర్తిస్తుందా? అనే ప్రశ్నలు చాలా మందిలో ఉంటాయి. ఈ సందర్భంగా వీటిపై మరిన్ని వివరాలను తెలుసుకుందాం రండి.
2025లో ఎన్ని సూర్యగ్రహణాలు ఏర్పడతాయి?: భూమి, సూర్యుడి కక్ష్యలోకి చంద్రుడువచ్చి సూర్యుడిని పూర్తిగా లేదా పాక్షికంగా కప్పేస్తాడు. ఆ సమయంలో సూర్యుడు కనిపించకపోవడంతో భూమిపై సూర్య కాంతి తగ్గిపోతుంది. ఇది అమావాస్య రోజుల్లో జరుగుతుంది. కానీ ప్రతి అమావాస్యకు గ్రహణాలు ఏర్పడవు. ఈ సమయంలో గ్రహణ ప్రభావం తమపై పడకుండా ఉండేందుకు ప్రజలు గ్రహణ దోష నివారణ నియమాలు చేపడతారు. ఇక వచ్చే ఏడాది రెండు సూర్యగ్రహణాలు ఏర్పడతాయని సమాచారం.
వచ్చే ఏడాది మొదటి సూర్యగ్రహణం ఎప్పుడంటే?: 2025లో మొదటి సూర్య గ్రహణం మార్చి 29న మధ్యాహ్నం 2:20 గంటలకు ఏర్పడి సాయంత్రం 6:13 వరకు ఉంటుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణం. ఇక 2025లో రెండో సూర్య గ్రహణం 21 సెప్టెంబర్ 2025న ఏర్పడుతుంది. ఇది కూడా పాక్షిక సూర్య గ్రహణమే.