JioHotstar Free Access Mobile Plans:డిస్నీ+ హాట్‌స్టార్, జియో సినిమా విలీనంతో ఇటీవలే 'జియోహాట్‌స్టార్' అనే కొత్త OTT ప్లాట్‌ఫారమ్ అవతరించింది. ఈ కొత్త ప్లాట్‌ఫారమ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పటికే ఈ రెండు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు విడివిడిగా ఉన్న సబ్‌స్క్రైబర్లకు తమ ప్లాన్ గడువు ముగిసే వరకు సబ్‌స్క్రిప్షన్ కొనసాగనుంది. ఆ తర్వాత ఇందుకోసం కొత్తగా ప్రారంభమైన 'జియోహాట్‌స్టార్' సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే జియో, వోడాఫోన్ ఐడియా సంస్థలు కూడా తమ మొబైల్ ప్లాన్‌లతో ఫ్రీ 'జియోహాట్‌స్టార్' యాక్సెస్‌ను అందిస్తున్నాయి. దీంతో మొబైల్ రీఛార్జ్‌లతో కూడా 'జియోహాట్‌స్టార్' సబ్‌స్క్రిప్షన్‌ను పొందొచ్చు. ఈ సందర్భంగా ఏ ఏ ప్లాన్లు ఫ్రీ 'జియోహాట్‌స్టార్' యాక్సెస్‌ను అందిస్తున్నాయో తెలుసుకుందాం రండి.
రిలయన్స్ జియోహాట్‌స్టార్ ప్లాన్లు: జియో ఇప్పటికే ఫ్రీ 'జియోసినిమా' యాక్సెస్‌ను అందించే అనేక ప్లాన్‌లను అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెట్‌వర్క్ ఆపరేటర్ 'జియోహాట్‌స్టార్' సబ్‌స్క్రిప్షన్‌తో చాలానే ప్లాన్‌లను కలిగి ఉంటుందని ఎవరైనా అనుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌లో కంటెంట్‌ను చూసేందుకు జియో నెట్‌వర్క్‌లో కేవలం రెండు ప్లాన్‌లను మాత్రమే ఉన్నాయి.
ఈ రెండింటిలో చౌకైనది కొత్తగా ప్రారంభించిన రూ. 195 క్రికెట్ డేటా ప్యాక్. ఇది 3 నెలల ఫ్రీ 'జియోహాట్‌స్టార్' సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. ఈ డేటా ఓన్లీ యాడ్-ఆన్ ప్లాన్ 15GB 4G/5G డేటాతో వస్తుంది. ఇది యాడ్-సపోర్టెడ్ 'జియోహాట్‌స్టార్' మొబైల్ ప్లాన్‌కు ఫ్రీ-యాక్సెస్‌ను అందిస్తుంది. ఇది వినియోగదారులు ఒకేసారి ఒక డివైజ్‌లో HD రిజల్యూషన్‌లో కంటెంట్‌ను స్ట్రీమ్ చేసేందుకు అనుమతిస్తుంది.
ఇక ఈ జాబితాలో మరో రూ. 949 ప్లాన్‌ను జియో ఇటీవలే అప్డేట్ చేసింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌తో 2GB 4G డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS, అన్లిమిటెడ్ 5G డేటా లభిస్తుంది.
మీరు ఇప్పటికే అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజువారీ డేటాను అందించే జియో ప్లాన్‌కు సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉంటే 'జియోహాట్‌స్టార్' ఫ్రీ యాక్సెస్‌కు రూ. 195 ప్యాక్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. కానీ తమ మొబైల్‌ను రీఛార్జ్ చేసుకోవాలనుకునే వారైతే ఖరీదైన ప్లాన్‌ను ఎంచుకుంటే బాగుంటుంది.
వొడాఫోన్ ఐడియా జియోహాట్‌స్టార్ ప్లాన్లు: వోడాఫోన్ ఐడియా కూడా కొన్ని లాభదాయకమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. ఇవి ఉచిత 'జియోహాట్‌స్టార్' మెంబర్షిప్ అందిస్తాయి. మీకు ఇప్పటికే యాక్టివ్ బేస్ ప్లాన్ ఉంటే, 4GB అండ్ 30 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రూ. 151 యాడ్-ఆన్ ప్లాన్‌ను చూడండి. దీనితో మీకు ఎటువంటి సర్వీస్ వ్యాలిడిటీ లభించనప్పటికీ, ఇది 3 నెలల 'జియోహాట్‌స్టార్' సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.