తెలంగాణ

telangana

ETV Bharat / technology

రిలయన్స్ మరో సంచలనం- జియో టీవీ ఓఎస్‌తో పాటు కాల్​లోనే ఏఐ - Reliance Introduces Jio TV OS - RELIANCE INTRODUCES JIO TV OS

Reliance Jio Introduces Jio TV OS: సంచలనానికి మారుపేరైన దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ కొత్తగా మరో ఆశ్చర్యకర ప్రకటన చేసింది. సెటాప్‌ బాక్స్‌ కోసం జియో టీవీ ఓఎస్‌తో పాటు జియో కాల్‌ ఏఐనూ ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సాధారణ సమావేశంలో ఈ సర్వీసులను పరిచయం చేసింది.

Reliance_Introduces_Jio_TV_OS
Reliance_Introduces_Jio_TV_OS (ETV Bharat)

By ETV Bharat Tech Team

Published : Aug 29, 2024, 6:17 PM IST

Reliance Introduces Jio TV OS:జియో ఫైబర్‌ ద్వారా ఇంటర్నెట్‌తో పాటు డిజిటల్‌ ఛానెళ్లను అందిస్తున్న రిలయన్స్‌ జియో సంచలనానికే మారుపేరు. ముకేశ్ అంబానీ కొంతకాలం కిందట దీన్ని తీసుకుని వచ్చారు. టెలికాం రంగంలోకి అడుగుపెడుతూనే ఇది విప్లవం తీసుకొచ్చింది. అన్​లిమిటెడ్ డేటాను తక్కువ ధరకే పరిచయం చేసింది. ఆ తర్వాత కూడా మరెన్నో ఆశ్చర్యకర ప్రకటనలు చేసింది. తాజాగా సెటాప్‌ బాక్స్‌ కోసం జియో టీవీ ఓఎస్‌ను ప్రకటించింది. దీంతో పాటు జియో కాల్‌ ఏఐ సర్వీసులనూ పరిచయం చేసింది.

రిలయన్స్ ఏజీఎమ్:ఇవాళ మధ్యాహ్నం 2 గంటల సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సాధారణ సమావేశం(Reliance AGM) నిర్వహించింది. ఈ సమావేశంలో భాగంగా జియో టీవీ ఓఎస్‌తో పాటు జియో కాల్‌ ఏఐనీ ప్రకటించారు. ఈ క్రమంలో ఈ కొత్త జియో టీవీ ఓఎస్​ ద్వారా తమ డిజిటల్‌ ఛానెల్‌ సేవలు మరింత మెరుగు కానున్నాయని ఆకాశ్‌ అంబానీ తెలిపారు. దీంతోపాటు జియో టీవీ ఓఎస్‌ ద్వారా 4కె యూహెచ్‌డీ, డాల్బీ విజన్‌, డాల్బీ అట్మాస్ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

'హెలో జియో':ఈ కొత్త జియో టీవీ ఓఎస్‌లో భాగంగా సెటాప్‌ బాక్స్‌ రిమోట్‌లోనే కొత్తగా ఏఐ బటన్‌ ఇస్తున్నారు. "హెలో జియో" పేరిట దీన్ని తీసుకొచ్చారు. దీని సహాయంతో వాయిస్‌ కమాండ్స్‌ ద్వారా సెటాప్‌ బాక్స్‌ను కంట్రోల్‌ చేయొచ్చు. ఇందుకోసం రిమోట్‌లోనే ఓ మైక్‌ బటన్​ను కూడా ఇచ్చారు. వాల్యూమ్‌ పెంచడం, తగ్గించడం వంటివి ఈ మైక్​ బటన్​ ద్వారా చేయొచ్చు. అంతేకాదు అమెజాన్‌ ప్రైమ్‌, డిస్నీ+ హాట్‌స్టార్‌ వంటి యాప్స్‌ను కూడా యాక్సెస్‌ చేయొచ్చని ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు.

జియో కాల్‌ ఏఐ సర్వీసులు:ఈ సందర్భంగా జియో ఫోన్‌కాల్ ఏఐ సర్వీసులనూ ప్రారంభిస్తున్నట్లు ఆకాశ్‌ అంబానీ ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ నంబర్‌ కేటాయించారు. ఈ కాల్‌లో కాల్స్‌ను రికార్డు చేసుకోవచ్చు. ఆ కాల్‌ రికార్డులు జియో క్లౌడ్‌లో ఆటోమేటిక్‌గా స్టోర్‌ అవుతాయని ఆకాశ్ తెలిపారు. కాల్‌ రికార్డును కావాలంటే వేరే భాషలో ట్రాన్స్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చని అన్నారు. జియో క్లౌడ్‌ నుంచి ఎప్పుడైనా వీటిని వినియోగించుకోవచ్చని ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు.

మార్కెట్లో ట్రై ఫోల్డ్ స్మార్ట్​ఫోన్- ఫస్ట్​లుక్​ మామూలుగా లేదుగా! - Tecno Phantom Ultimate 2 FIRST LOOK

శాంసంగ్ ఫోన్లపై అదిరే ఆఫర్స్- రూ.6వేల వరకు భారీ తగ్గింపు! - huge discounts on samsung phones

ABOUT THE AUTHOR

...view details