Phone Restarting Pros And Cons : స్మార్ట్ ఫోన్ టెక్నాలజీకి ఎవరైనా నిర్వచనం చెప్పాలని భావిస్తే, దానికి ప్రామాణికంగా ఐఫోన్‌ను చూపిస్తారు. దాని మేకింగ్ అంత అద్భుతంగా ఉంటుంది. ఐఫోన్ బ్యాటరీ నుంచి మొదలుకొని బాడీ దాకా ప్రతీదీ హైక్వాలిటీ, హైటెక్ టెక్నాలజీతో కూడుకొని ఉంటాయి. అలాంటి ఐఫోన్‌ను రీస్టార్ట్ చేసే విషయంలో చాలామంది యూజర్లు నానా హైరానా పడిపోతుంటారు. రీస్టార్ట్/రీబూట్ చేస్తే ఫోన్‌లో ఏమేం జరిగిపోతుందో అని అనవసరంగా కలత చెందుతుంటారు. ఇలాంటి అపోహలకు టెక్ నిపుణుల సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
స్పీడ్ - కూల్ - పవర్
రీస్టార్ట్ చేయడం వల్ల ఐఫోన్ పనితీరు దెబ్బతింటుందనే అపోహ చాలామందికి ఉంటుంది. అయితే అందులో కొంచెం కూడా వాస్తవికత లేదు. రీస్టార్ట్ చేయడం వల్ల ఐఫోన్ పర్ఫామెన్స్ మునుపటి కంటే మరింత బెటర్ అవుతుంది. అప్పటిదాకా ఐఫోన్‌లోని హార్డ్‌వేర్‌ను ఆవరించిన వేడి మటుమాయం అయిపోతుంది. దీంతో అది కూల్ అయిపోతుంది. కూల్ అయ్యాక, ఆటోమేటిక్‌గా ఐఫోన్ పనితీరులో స్పీడ్ పెరగడాన్ని యూజర్లు స్పష్టంగా గుర్తించొచ్చు. రీస్టార్ట్ చేయడం వల్ల మనకు తెలియకుండా బ్యాక్ గ్రౌండ్‌లో రన్ అవుతున్న కొన్ని యాప్స్, ఇతరత్రా సాఫ్ట్‌వేర్లు క్లోజ్ అవుతాయి. బ్యాక్ గ్రౌండ్‌లో రన్ అయ్యే యాప్స్, బ్యాటరీ పవర్‌ను రహస్యంగా వాడేస్తుంటాయి. రీస్టార్ట్ వల్ల అలాంటి యాప్స్ బెడద నుంచి ఐఫోన్ బయటపడి, బ్యాటరీ పవర్‌ను మరింత పొదుపు చేయడం మొదలుపెడుతుంది. దీనివల్ల మనం ఛార్జింగ్ లేకుండా ఇంకా అదనపు సమయాన్ని దానితో గడిపేందుకు మార్గం సుగమం అవుతుంది.
అతిపెద్ద పరిష్కారం ఇదే!
ఐఫోన్ వాడుతుండగా అరుదుగా కొన్ని టెక్నికల్ సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటి వాటికి కూడా అతిపెద్ద పరిష్కారంగా రీస్టార్ట్ ఆప్షన్ పనికొస్తుంది. టెక్ ప్రాబ్లమ్‌ను క్రియేట్ చేస్తున్న సాఫ్ట్‌వేర్లను ఆటోమేటిక్‌గా రీసెట్ చేసేందుకు ‘రీస్టార్ట్’ కంటే ఉత్తమ మార్గం మరొకటి ఉండదని టెక్ నిపుణులు చెబుతుంటారు. రీస్టార్ట్ తర్వాత ఐఫోన్‌లోని ప్రాసెసర్ మరింత చురుగ్గా యాక్టివిటీస్ చేస్తుంది. ఫలితంగా బ్రౌజింగ్‌లో మనం ఎంతో కంఫర్ట్‌ను ఫీల్ అవుతాం. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉండబట్టే, ప్రతిరోజూ కనీసం ఒక్కసారైనా ఐఫోన్‌ను రీస్టార్ట్ చేయడం మంచిదని నిపుణులు సలహా ఇస్తుంటారు.