తెలంగాణ

telangana

ETV Bharat / technology

OTP మోసాలకు చెక్- హైదరాబాదీ సాఫ్ట్‌వేర్‌తో ఇక హ్యాకర్లకు చుక్కలే! - OTP Frauds Solution - OTP FRAUDS SOLUTION

OTP Frauds Solution : ఓటీపీ ఫ్రాడ్స్‌కు చెక్ పెట్టే సాఫ్ట్‌వేర్‌ వచ్చేసింది. ADAPID సాఫ్ట్‌వేర్‌‌తో హ్యాకర్ల ఆగడాలకు చరమగీతం పాడొచ్చని టెక్ నిపుణులు చెబుతున్నాయి. ఇది పూర్తిగా మేడిన్ ఇండియా సాఫ్ట్‌వేర్. దీని అభివృద్ధి మన హైదరాబాద్‌కు చెందిన డీప్ అల్గారిథమ్స్ కంపెనీ కీలక పాత్ర పోషించింది. ఇంతకీ ఇది ఓటీపీ ఫ్రాడ్లను ఎలా ఆపుతుందో తెలుసుకుందాం.

OTP Frauds Solution IIT Mandi
OTP Frauds Solution IIT Mandi

By ETV Bharat Telugu Team

Published : Mar 26, 2024, 6:40 PM IST

OTP Frauds Solution :సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. సిమ్ స్వాపింగ్ ద్వారా ఇతరుల ఫోన్ నంబర్ల ఓటీపీలను తమ ఫోన్లకు తెప్పించుకుని బ్యాంకు అకౌంట్లను కొల్లగొడుతున్నారు. ఈ పద్ధతిలో ఇతరుల పాస్‌వర్డ్‌లను హ్యాక్ కూడా చేస్తున్నారు. ఇలాంటి మోసాలకు చెక్ పెట్టేందుకు ఓ సాఫ్ట్‌వేర్ రెడీ అయింది. దాని పేరే ADAPID!!

మన హైదరాబాద్ కేంద్రంగా డీప్ అల్గారిథమ్స్ అనే కంపెనీ పనిచేస్తోంది. దానికి హిమాచల్ ప్రదేశ్‌లోని ఐఐటీ మండిలో, ఉత్తరప్రదేశ్‌లోని ఐఐటీ కాన్పుర్‌లో చెరో ఇంక్యుబేషన్ (రీసెర్చ్) సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ADAPID సాఫ్ట్‌వేర్‌ను ఐఐటీ మండికి చెందిన సెంటర్ ఫర్ ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ అండ్ రోబోటిక్స్ (CAIR) విభాగం, డీప్ అల్గారిథమ్స్ ఇంక్యుబేషన్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇంతకీ ఈ సాఫ్ట్‌వేర్ ఎలా పనిచేస్తుంది? ఓటీపీ ఫ్రాడ్లను ఎలా ఆపుతుంది? దీన్ని ఏ తరహా సంస్థలు వాడుకోవచ్చు? ఇప్పుడు తెలుసుకుందాం.

దడపుట్టిస్తున్న సైబర్ కేటుగాళ్లు
ఏ డివైజ్‌ను మనం వాడినా అందులో మనకు సంబంధించిన బయోమెట్రిక్ సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. ఉదాహరణకు స్మార్ట్ ఫోన్‌లో మన యూజర్ నేమ్స్, పాస్ వర్డ్స్, వేలిముద్రల నమూనాలు, ఫేషియల్ రికగ్నిషన్ ఫొటోలు నిక్షిప్తమై ఉంటాయి. ఆఫీసుకు వెళ్లి బయోమెట్రిక్ మెషీన్‌లో ఫేస్ లేదా థంబ్ స్కాన్ చేస్తుంటాం. ఆ రెండు పద్ధతులతో ముడిపడిన బయోమెట్రిక్ చిట్టా అంతకుముందే ఆ యంత్రంలో సేవ్ అయి ఉంటుంది. ఈ బయోమెట్రిక్ సమాచారం ఆధారంగానే వివిధ టెక్ డివైజ్‌లు మనల్ని వెంటనే గుర్తుపడుతుంటాయి. ఇటీవల కాలంలో హ్యాకర్లు తెలివి మీరిపోయారు. మహా ముదుర్లుగా తయారయ్యారు. సిమ్ స్వాప్ టెక్నాలజీతో ఓటీపీలను తమ ఫోన్‌కు తెప్పించుకొని అవలీలగా ఇతరుల ఓటీపీలను తమ డివైజ్‌లలోకి రప్పించుకుంటున్నారు. ఈ తరహా మోసాలను ఆపే సామర్థ్యం ADAPID సాఫ్ట్‌వేర్‌కు ఉందని ఐఐటీ మండి శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

హ్యాకింగ్‌ను ఇలా అడ్డుకుంటుంది
ఇతరులు నిత్యం లాగిన్ ఎలా చేస్తుంటారు ? లాగ్ ఔట్ ఎలా చేస్తుంటారు ? ఏయే సమయాల్లో డివైజ్‌లను వాడుతుంటారు ? అనే బయోమెట్రిక్ సమాచారాన్ని ADAPID సాఫ్ట్‌వేర్ తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. ఇంతకుమునుపు తాను నిక్షిప్తం చేసిన బయోమెట్రిక్ సమాచారానికి భిన్నంగా యాక్టివిటీ జరిగినప్పుడు వెంటనే సాఫ్ట్‌వేర్‌లోని ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ సెక్యూరిటీ సిస్టమ్ అలర్ట్ అవుతుంది.

అవతలి వైపు ఎవరో అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నారనే అంచనాకు వస్తుంది. వారి లాగిన్ లేదా లాగౌట్ ప్రయత్నాలను కంటిన్యూ చేయడానికిగానూ కీలకమైన బయోమెట్రిక్ సమాచారాన్ని కొత్తగా నమోదు చేయాలని అడుగుతుంది. అది కూడా నేరుగా వేలిముద్రలు, ఫేషియల్ రికగ్నిషన్, ఐరిస్ స్కానింగ్ వంటి ఆప్షన్లు ఇస్తుంది. ఓటీపీ ఆధారంగా ఇతరుల డివైజ్‌ను హ్యాక్ చేయాలని యత్నించే సైబర్ నేరగాళ్లు ఇతరుల వేలిముద్రలు, ఫేషియల్ రికగ్నిషన్, ఐరిస్ స్కానింగ్ వంటివి ఇవ్వలేరు. ఫలితంగా ఆ హ్యాకింగ్ తతంగానికి అక్కడితోనే చెక్ పడుతుంది.

కేంద్ర ఐటీశాఖతో చర్చలు
పాస్‌వర్డ్‌ చోరీలు, ఫిషింగ్ దాడులు, బ్రూట్ ఫోర్స్ ఉల్లంఘనలకు కూడా ADAPIDతో చెక్ పడుతుందని డీప్ అల్గారిథమ్స్ నిర్వాహకుడు జేపీ మిశ్రా, ఐఐటీ మండిలోని సెంటర్ ఫర్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ సంస్థ ప్రతినిధి అమిత్ శుక్లా తెలిపారు. ఓటీపీతో హ్యాకింగ్ కార్యకలాపాలకు పాల్పడుతూ ఎవరైనా ఈ సాఫ్ట్‌వేర్‌కు దొరికిపోతే అతడు నిజమైన యూజరా ? కాదా ? అనేది నిర్ధారించేందుకు అంచెలవారీగా వివిధ స్టెప్స్ జారీ అవుతాయి. ఈ స్టెప్స్‌లో ఇన్ విజిబుల్ కీబోర్డ్, డీ సెంట్రలైజ్డ్ వెబ్ ప్రోటో వంటి అధునాతన ఆప్షన్లు ఉంటాయి.

వాటన్నింటిని సక్సెస్ ఫుల్‌గా అధిగమిస్తేనే లాగిన్ లేదా సైన్ ఇన్‌కు అవకాశం లభిస్తుంది. హ్యాకర్లు ఈ స్టెప్స్ అన్నీ పూర్తి చేయడం అసాధ్యమని అమిత్ శుక్లా, జేపీ మిశ్రా పేర్కొన్నారు. ADAPID సాఫ్ట్‌వేర్‌కు ఇప్పటికే తాము పేటెంట్ పొందామన్నారు. కొన్ని బ్యాంకులు, ఫోరెన్సిక్ కంపెనీలు దీన్ని వినియోగిస్తున్నాయని చెప్పారు. పలు కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ADAPID సాఫ్ట్‌వేర్‌ వినియోగానికి సంబంధించి తాము కేంద్ర ఐటీ శాఖతో చర్చలు జరుపుతున్నట్లు వారు వెల్లడించారు. కంపెనీలు, బ్యాంకులు, ఆర్థిక సేవా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పథకాలను అమలు చేసే సంస్థలకు ఈ సాఫ్ట్‌వేర్ చాలా ఉపయోగపడుతుందని అమిత్ శుక్లా, జేపీ మిశ్రా వివరించారు.

ABOUT THE AUTHOR

...view details