తెలంగాణ

telangana

ETV Bharat / technology

వారెవ్వా 'న్యూవా పెన్'- రాసే ప్రతీ పదం కెమెరాల్లో సేవ్- క్షణాల్లో డిజిటల్​ కాపీ రెడీ! - REMARKABLE PAPER PRO PEN CES 2025

అదుర్స్ అనిపించే డిజిటల్ ఫీచర్లతో 'న్యూవా పెన్'- కాగితంపై రాస్తే తక్షణం మొబైల్ యాప్‌లో ప్రత్యక్షం- లాస్ వెగాస్‌ 'కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో'లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన స్మార్ట్ పెన్

Nuwa Pen CES 2025
Nuwa Pen CES 2025 (Source : Nuwa)

By ETV Bharat Telugu Team

Published : Jan 12, 2025, 5:02 PM IST

Updated : Jan 12, 2025, 9:14 PM IST

Nuwa Pen CES 2025 : ప్రపంచంలోనే స్మార్ట్ పెన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. దీనిలో మూడు చిన్నపాటి కెమెరాలు కూడా ఉంటాయి. మన రాసే ప్రతీ అక్షరాన్ని అది షూట్ చేసి దాచిపెడుతుంది. మనకు అవసరమైనప్పుడు ఈ ఫుటేజీని అందించేందుకు ప్రత్యేక యాప్ ఉంటుంది. అదరగొట్టే ఫీచర్లతో కూడిన ఈ పెన్నును నెదర్లాండ్స్ దేశానికి చెందిన న్యూవా కంపెనీ తయారు చేసింది. ఇటీవలే అమెరికాలోని లాస్ వెగాస్‌లో జరిగిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో(సీఈఎస్)-2025లో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంతకీ ఇదెలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

రాసే వాళ్లంతా ఇది తెలుసుకోండి!
పేపర్‌పై పెన్నుతో రాసే ఆసక్తి కలిగిన వాళ్లంతా తప్పకుండా ఈ స్మార్ట్ పెన్ పనితీరు గురించి తెలుసుకోవాలి. అమెజాన్ సరికొత్తగా తీసుకొచ్చిన 'కిండిల్ స్క్రైబ్' ద్వారా మనం పుస్తకాన్ని చదివే క్రమంలో, ప్రతీ పేజీ అంచుల్లో నోట్స్ రాసుకోవచ్చు. ఈ టెక్నాలజీని మరో ఎత్తుకు తీసుకెళ్లే స్థాయిలో న్యూవా స్మార్ట్ పెన్‌లో ఫీచర్లు ఉన్నాయని దాన్ని స్వయంగా పరీక్షించిన ఒక టెక్ నిపుణుడు వెల్లడించాడు. న్యూవా పెన్‌లో తాను గుర్తించిన కొన్ని ప్రత్యేకతలను అతడు చక్కగా వివరించాడు.

న్యూవా పెన్‌ ఏమేం చేయగలదు ?
న్యూవా పెన్ కొన్నవారికి, ఆ పెన్నుకు సంబంధించిన ప్రత్యేక మొబైల్ యాప్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ఈ పెన్నులో మూడు చిన్నపాటి కెమెరాలు అమర్చి ఉంటాయి. న్యూవా పెన్‌తో మనం పేపరుపై రాసినా, న్యాప్‌కిన్‌పై రాసినా ఆ పదాలన్నింటిని కెమెరాలు షూట్ చేస్తాయి. వాటిని సేవ్ చేసి ఆటోమేటిక్‌గా న్యూవా పెన్ మొబైల్ యాప్‌నకు పంపుతాయి. ఇందుకోసం కొన్ని నిమిషాల సమయం పడుతుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఎలా ఉంది? మనం రాసిన నోట్స్ నిడివి ఎంత? అనే అంశాల ఆధారంగా మొబైల్ యాప్‌లో చేతిరాత నోట్స్ సేవ్ అయ్యే సమయంలో హెచ్చుతగ్గులు జరుగుతుంటాయి.

నోట్స్​ డిజిటల్​ కాపీ రెడీ
మనం న్యూవా యాప్‌ను తెరిచి పేపర్‌పై రాసిన పదాలను చూసుకోవచ్చు. అంటే కాగితంపై రాసిన అంశాలు, మన ప్రయత్నం లేకుండానే నేరుగా డిజిటల్ రూపంలోకి మారిపోయాయి. అవసరం అనుకుంటే ఇలా డిజిటల్ రూపంలోకి మారిన వివరాలను మనం నేరుగా ప్రింట్ కూడా తీసుకోవచ్చు.

రాసి మర్చిపోతామనే బెంగ ఉండదు
న్యూవా పెన్ జేబులో ఉంటే మనం ఎక్కడైనా, ఏదైనా రాసి మర్చిపోతామనే బెంగ ఉండదు. ఎందుకంటే మనం రాసే ప్రతీ అంశాన్ని అందులోని కెమెరాలు రికార్డు చేస్తాయి. ఈ పెన్నుతో రాసిన ఏదైనా అంశాన్ని మర్చిపోతే, న్యూవా పెన్ యాప్‌లోకి వెళ్లి అందులో సేవ్ అయిన డిజిటల్ ఫైల్‌ను ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఒకవేళ న్యూవా పెన్ యాప్‌లో చాలా ఫైల్స్ సేవ్ అయి ఉంటే, మన గతంలో రాసిన చేతిరాత నోట్సులోని ఏదైనా ఒక పదాన్ని సెర్చ్ బాక్సులో ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఆ పదంతో కూడిన ఫైల్స్ అన్నీ తేదీలతో సహా మన ముందు డిస్‌ప్లే అవుతాయి.

యాపిల్​ కంటే మెరుగ్గా!
ఐఫోన్ కంపెనీకి చెందిన నోట్స్ యాప్ కంటే న్యూవా పెన్‌లో ఎక్కువ ఫీచర్లు ఉన్నాయని దాన్ని రివ్యూ చేసిన టెక్ నిపుణుడు చెప్పుకొచ్చాడు. అయితే ఈ పెన్నులోని సాఫ్ట్‌వేర్‌ను మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. ఈ డిజిటల్ ప్రపంచంలో ఇలాంటి అత్యాధునిక పెన్నులను కొనే సంపన్న కస్టమర్లు కూడా ఉంటారని అతడు చెప్పుకొచ్చాడు. తనకు కూడా అది బాగా నచ్చిందన్నాడు.

Last Updated : Jan 12, 2025, 9:14 PM IST

ABOUT THE AUTHOR

...view details