Nokia 3210 Smartphone :నోకియా మొబైల్ లవర్స్‌కు గుడ్ న్యూస్. హెచ్ఎండీ సంస్థ నోకియా 3210 అప్డేటెడ్ వెర్షన్‌ను మళ్లీ లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. పైగా నోకియా అభిమానులను ఊరిస్తూ ఎక్స్‌లో 'నోకియా బర్త్ డే' ఫొటోను కూడా షేర్ చేసింది.
సో పాపులర్
ఈ ప్రపంచంలో నోకియా మొబైల్ తెలియనివారు ఉండరంటే అది అతిశయోక్తి కాదు. స్మార్ట్‌ఫోన్స్ రాక ముందు కీప్యాడ్ మొబైల్స్‌లో నోకియానే నంబర్-1గా ఉండేది. అందుకే దానిని మరోసారి ప్రజలకు అందుబాటులోకి తేవాలని, ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ హెచ్ఎండీ (Human Mobile Devices) సన్నాహాలు చేస్తోంది. బహుశా మే నెలలోనే ఈ అప్డేటెడ్ నోకియా హ్యాండ్‌సెట్‌ను లాంఛ్ చేసే అవకాశం ఉంది. అయితే హెచ్ఎండీ ఈ కొత్త నోకియా ఫోన్ పేరును ఇంకా వెళ్లడించలేదు. బహుశా ఇది నోకియా 3210 మోడల్ అప్డేటెడ్ వెర్షనే అయ్యుంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
పునరుత్తేజంతో
ఈ ఫిన్నిష్ మొబైల్ తయారీ కంపెనీ గత కొన్నేళ్లుగా నోకియా బ్రాండెడ్ ఫోన్ల ప్రొడక్షన్‌ను తగ్గిస్తూ వచ్చింది. కానీ 2024లో ఓ దృఢమైన నిర్ణయం తీసుకుంది. తమ బ్రాండెడ్ ఫోన్ల తయారీని మరింత ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా సరికొత్త నోకియా ఫోన్‌ను మే నెలలో లాంఛ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటించింది. ఈ ప్రకటనలో పసుపు రంగులో ఉన్న నోకియా పిక్సలేటెడ్ ఫోటోను షేర్ చేసింది. దానికి 'An Icon Returns this May' అనే ట్యాగ్‌లైన్‌ను జత చేసింది.