Bharat NCAP:దేశంలో రోడ్డు భద్రత, వాహనాల ప్రమాణాలను పెంపొందించటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. భారత్ ఎన్సీఏపీను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం లాంచ్ చేసి లోగో, స్టిక్కర్ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రాం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. కారు క్రాష్ టెస్ట్ ప్రోగ్రాం అమెరికా, చైనా, జపాన్, దక్షిణ కొరియాలో ఇప్పటికే అమల్లో ఉన్నాయి. తాజాగా దీన్ని ఇండియాలో కూడా లాంచ్ చేయటంతో కార్ క్రాష్ టెస్ట్ ప్రోగ్రాం కలిగి ఉన్న ఐదో దేశంగా భారత్ నిలవనుంది.
ఏంటీ భారత్ ఎన్సీఏపీ?:
- ప్రయాణికుల భద్రతా ప్రమాణాలను పరీక్షించి సేఫ్టీ రేటింగ్ ఇచ్చే కొత్త విధానమే ఈ Bharat NCAP.
- ఈ విధానం కింద ఇండియాలో తయారు చేసిన వాహనాల సేఫ్టీని టెస్ట్ చేస్తారు.
- ఇండియాలో తయారు చేసినా లేదా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నా సంబంధిత కారుకు Bharat NCAP సర్టిఫికేట్ ఉండాల్సిందే.
- దీనిలో భాగంగా వాహనాల తయారీ సంస్థలు, తమ మోడల్స్‌ను ఏఐఎస్ 197 (ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్) కింద వాలంటరీ టెస్టింగ్‌కు ఇవ్వొచ్చు.
- ఇది స్వచ్ఛందమే అయినా సంస్థలన్నీ ఇందులో పాల్గొనే విధంగా ప్రోత్సహిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
- అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్ కింద అధికారులకు ఏ షోరూమ్ నుంచైనా, ఏ వాహనాన్ని అయినా పిక్ చేసి పరీక్షించే అధికారం వస్తుంది.
- గ్లోబల్ ఎన్సీఏపీ, యూరో ఎన్సీఏపీ వంటి టెస్టింగ్ ప్రోగ్రామ్స్‌ను కలగలిపి ఈ Bharat NCAPని రూపొందించారు.
- ఏఓపీ (అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్), సీఓపీ (చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్)తో పాటు వివిధ టెస్ట్‌లు నిర్వహించి స్టార్ రేటింగ్స్ ఇస్తారు.
- ఈ టెస్ట్‌లో 3 అంతకంటే ఎక్కువ రేటింగ్ పొందాలంటే వాహనాల్లో కచ్చితంగా ఈఎస్సీ (ఎలక్ట్రానిక్ స్టెబులిటీ కంట్రోల్) ఉండాల్సిందే.