Airtel Calling Plan Price Reduce: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ కొత్తగా తీసుకొచ్చిన వాయిస్ కాలింగ్, SMS ఓన్లీ ప్లాన్‌ల ధరలను మరోసారి సవరించింది. ఇటీవల తీసుకొచ్చిన రెండు ప్లాన్‌ల ప్రయోజనాలను అలాగే ఉంచుతూ ధరలను మార్చుతూ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌లను ప్రారంభించిన రెండు రోజుల్లోనే కంపెనీ వీటిని సవరించడం గమనార్హం.
భారతీ ఎయిర్‌టెల్ జనవరి 23, 2025న వాయిస్ కాలింగ్, SMS కోసం మాత్రమే రూ.499, రూ.1959లతో రెండు కొత్త ప్లాన్‌లను ప్రారంభించింది. అయితే రెండు రోజుల్లోనే వీటి ధరలను వరుసగా రూ.469, రూ.1849గా మార్చింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ ఈ కొత్త ప్లాన్‌ల ధరలను కేవలం రెండు రోజుల్లోనే ఎందుకు తగ్గించిందో తెలుసుకుందాం రండి.
ఇంతకు ముందు టెలికాం కంపెనీలు అందించే రీఛార్జ్ ప్లాన్లలో డేటా సదుపాయం కూడా ఉండేది. అయితే ఇంటర్నెట్ అవసరం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో వినియోగదారులు రీఛార్జి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వాయిస్, SMSల కోసం ప్రత్యేకంగా రీఛార్జి ప్లాన్లు తీసుకురావాలని ఆయా కంపెనీలను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆదేశించింది. ఈ క్రమంలో స్పెషల్ టారిఫ్ వోచర్లు తీసుకురావాలంటూ సూచించింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్‌తో పాటు, జియో, VI కూడా మూడు రోజుల క్రితం తమ కొత్త కాలింగ్, SMS ఓన్లీ ప్లాన్‌లను ప్రారంభించాయి.
ఎయిర్‌టెల్ తన పాత రూ.509 ప్రీపెయిడ్ ప్లాన్‌ను నిలిపివేసి రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇంతకు ముందు రూ. 509 ప్లాన్‌లో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు, మొత్తం 6GB డేటాతో పాటు ఎక్స్‌ట్రీమ్ యాప్‌ల ప్రయోజనాలను అందించింది. అయితే ఆ తర్వాత ఈ ప్లాన్ స్థానంలో కంపెనీ రూ.10 తక్కువకు అంటే రూ.499కి కాలింగ్, SMS ఓన్లీ ప్లాన్‌ను ప్రారంభించింది. దీనిలో వినియోగదారులకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 900 SMSల సౌకర్యం మాత్రమే అందించింది.
ఇక రూ.1999తో ఉన్న పాత ప్లాన్‌ను తొలగించి రూ.1959 కొత్త కాలింగ్ ఓన్లీ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇంతకుముందు రూ.1999 ప్లాన్‌లో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు, మొత్తం 24GB డేటాతో పాటు ఎక్స్‌ట్రీమ్ యాప్‌ల ప్రయోజనాలను అందించింది. అయితే ఇటీవలే ఈ ప్లాన్ స్థానంలో కంపెనీ కేవలం రూ.40 తక్కువకు అంటే రూ.1,959కి కాలింగ్ ప్లాన్‌ను ప్రారంభించింది. దీనిలో వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు 3,600 SMSల సౌకర్యం మాత్రమే అందించింది.
అంటే ఎయిర్‌టెల్ తీసుకొచ్చిన ఈ రెండు కొత్త కాలింగ్ ప్లాన్స్‌లో వినియోగదారలకు నష్టాన్నే కలిగిస్తున్నాయి. ఎందుకంటే వారి పాత రూ. 509 ప్లాన్‌లోని 6GB డేటా, ఎక్స్‌ట్రీమ్ యాప్‌ల ప్రయోజనాలను తీసేసి ధరను కేవలం రూ. 10 మాత్రమే తగ్గించింది. అంతేకాక 8400 SMSలకు బదులుగా 900 SMSల సౌకర్యం మాత్రమే అందించింది.