Audi Q5 Sportback: లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి తన కొత్త 'Q5 స్పోర్ట్‌బ్యాక్' SUVని ఆవిష్కరించింది. ఇది దాని స్టాండర్డ్ 'ఆడీ Q5'కి కూపే-ఎస్‌యూవీ వెర్షన్. కంపెనీ ఈ కారును ప్రత్యేకమైన డిజైన్‌తో అద్భుతమైన ఫీచర్లతో తీసుకొచ్చింది. మరెందుకు ఆలస్యం దీని ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
ఎక్స్టీరియర్:ఈ కొత్త Q5 స్పోర్ట్‌బ్యాక్ ముందు భాగం చాలా వరకు స్టాండర్డ్ SUVని పోలి ఉంటుంది. అయితే ఇందులో చాలా మార్పులు చేశారు. స్లోపింగ్ రూఫ్‌తో దీని వెనక భాగం పూర్తిగా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇందులో స్పాయిలర్ ఉంది. ఇది దాని కూపే-SUV లుక్‌ను మరింత మెరుగుపరుస్తుంది. ఈ కారు వెనకవైపు OLED టెక్నాలజీతో టెయిల్-ల్యాంప్స్‌తో పాటు స్టాండర్డ్ SUV మాదిరిగానే కాంట్రాస్టింగ్ సిల్వర్ ట్రిమ్‌తో డ్యూయల్-టోన్ బంపర్‌ను కలిగి ఉంది.
ఇంటీరియర్: ఈ కూపే-SUV దాని ప్రీవియస్ మోడల్‌తో పోలిస్తే మరింత మోడ్రన్ క్యాబిన్‌ను కలిగి ఉంది. దాని క్యాబిన్‌లో స్పోర్ట్, S లైన్, క్వాట్రో వంటి థ్రీ ఎక్విప్మెంట్ లెవెల్స్ అందుబాటులో ఉన్నాయి. దీనిలోని హైయర్ వేరియంట్స్ ఆడి కొత్త 'డిజిటల్ స్టేజ్' స్క్రీన్‌తో వస్తున్నాయి. ఇది 11.9-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, 14.5-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌తో కలిపి ఒక లార్జ్ OLED ప్యానెల్‌ను కలిగి ఉంది. స్టాండర్డ్ 'ఆడి Q5' మాదిరిగానే ఫ్రంట్ ప్యాసింజర్ల కోసం 10.9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఆప్షన్ అందుబాటులో ఉంది.
పవర్‌ట్రెయిన్: ఈ లైనప్‌లోని ఎంట్రీ-లెవల్ 2.0-లీటర్, 4-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 204hp పవర్, 340Nm టార్క్‌ను అందిస్తుంది. ఇందులో ఫ్రంట్-వీల్ డ్రైవ్ లేదా AWD సెటప్ అందుబాటులో ఉంది. దీంతోపాటు ఇందులో స్టాండర్డ్‌గా 2.0-లీటర్, 4-సిలిండర్ డీజిల్ క్వాట్రోని కలిగి ఉంది. ఇది 204hp శక్తిని, 400Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.