Netflix Secret Menu :నెట్‌ఫ్లిక్స్‌లో బోలెడు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, టీవీ షోలు ఉంటాయి. కానీ యాప్ తెరవగానే, కొన్ని లేటెస్ట్ మూవీస్ మాత్రమే కనిపిస్తుంటాయి. వీటిలో మన అభిరుచికి తగినవి ఉండకపోవచ్చు. అందువల్ల చాలా మంది సబ్స్క్రైబర్లు డీలా పడిపోతుంటారు. వాస్తవానికి మీరు గతంలో చూసిన వీడియోలు ఆధారంగా, నెట్ఫిక్స్ ఆల్గారిథమ్ పనిచేస్తుంది. ఇది మీ అభిరుచికి అనుగుణమైన వీడియోలను చూపిస్తుంటుంది. అయితే ఇది ఎల్లవేళలా సరిగ్గా పనిచేస్తుందని చెప్పలేము. కనుక మీరు కోరుకున్న కంటెంట్ మీకు కనిపించకపోవచ్చు. అయితే మీరేమీ చింతించాల్సిన పనిలేదు. నెట్‌ఫ్లిక్స్‌లో ఓ 'సీక్రెట్ మెనూ' ఉంది. దీనిని ఉపయోగించి, మీకు నచ్చిన బెస్ట్ వీడియోలను వీక్షించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ మెనూ అనేది కోడ్-బేస్డ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. దీనిని ఉపయోగించి, మీరు కోరుకున్న జోనర్లోని వీడియోలు చూడవచ్చు. అంతేకాదు నెట్‌ఫ్లిక్స్‌లో ఉంటే వేలాది వీడియోల్లో, మీరు కోరుకున్న కేటగిరీ, సబ్కేటగిరీలోని చిత్రాలను, వెబ్-సిరీస్‌లను బ్రౌజ్ చేయవచ్చు. దీని వల్ల మీకు నచ్చిన వీడియో కోసం గంటల తరబడి వెతుక్కోవాల్సిన పని ఉండదు.
నెట్‌ఫ్లిక్స్ కోడ్స్
What Are Netflix Codes :ఈ నెట్‌ఫ్లిక్స్ కోడ్స్ ఆండ్రాయిడ్ యాప్‌లో పనిచేయవు. వీటిని కేవలం నెట్‌ఫ్లిక్స్ వెబ్సైట్లో మాత్రమే వాడగలం. ఒక ప్రత్యేకమైన సంఖ్య రూపంలో ఈ కోడ్ ఉంటుంది. దీనిని ఉపయోగించి మీకు నచ్చిన జోనర్, సబ్-జోనర్లోని వీడియోలు చూడవచ్చు. అది ఎలా అంటే?
నెట్‌ఫ్లిక్స్ యూఆర్ఎల్ (URL) చివరన ఈ కోడ్లను జోడించాలి. అంతే సింపుల్. మీరు ఎంచుకున్న కేటగిరీ, సబ్-కేటగిరీలోని చిత్రాలు, టీవీ షోలు మీకు నేరుగా కనిపిస్తాయి.
ఉదాహరణకు మీరు కేవలం 90 నిమిషాల నిడివి గల సినిమా చూడాలని అనుకంటే, 81466194 కోడ్ ఉపయోగించాలి. లేదా మీరు కుటుంబ కథా చిత్రాలు చూడాలనుకుంటే 2013975 కోడ్ ఉపయోగించాలి. ఈ విధంగా నెట్‌ఫ్లిక్స్‌లో మీకు నచ్చిన మూవీ చూడడానికి దాదాపుగా 36,000 కోడ్లు అందుబాటులో ఉన్నాయి. కంగారు పడకండి. వీటిని మీరు కంఠస్థం చేయాల్సిన పనిలేదు. https://www.netflix-codes.com/ అనే వెబ్సైట్లో ఇవన్నీ కనిపిస్తాయి.
ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, నెట్‌ఫ్లిక్స్ సీక్రెట్ మెనూ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఈ సీక్రెట్ కోడ్సే మీకు మెనూలా పనిచేస్తాయి. వీటిపై క్లిక్ చేయగానే, మీకు నచ్చిన జోనర్లోని వీడియోలు మొత్తం కనిపిస్తాయి.
Netflix-Codes.comలో 20 టాప్-లెవల్ కేటగిరీలు ఉంటాయి. వీటిలో యానిమేషన్, యాక్షన్-అడ్వంచర్, చిల్డ్రన్ & ఫ్యామిలీ మూవీస్, కామెడీ, రొమాంటిక్, హారర్, థ్రిల్లర్, సైంటిఫిక్ & ఫ్యాంటసీ, స్పోర్ట్స్ మూవీస్ ఉంటాయి. అలాగే టీవీ షోలు, డ్రామాలు, డాక్యుమెంటరీలు, మ్యూజిక్ సహా భిన్నమైన జోనర్స్ ఉంటాయి. వీటిలో మీకు నచ్చిన దానిని హాయిగా చూసుకోవచ్చు.