AI Pets For Emotional Relief : కృత్రిమ మేధస్సు(ఏఐ)తో పనిచేసే సోషల్ రోబోలు ప్రజల మదిని దోస్తున్నాయి. మానసిక ఉద్వేగం, ఆందోళనల నుంచి మనుషులకు ఉపశమనాన్ని అందిస్తున్నాయి. ఆ రీతిలో అవి మమేకం అయిపోతున్నాయి. వినూత్న ఆవిష్కరణల హబ్‌గా మారిన చైనాలో ఏఐ రోబోలు సందడి చేస్తున్నాయి. నిత్య జీవితంలో ఒత్తిడితో సతమతం అవుతున్న ఎంతో మంది యువ చైనీయులతో స్నేహితుల్లాగా మెదులుతున్నాయి. మరిన్ని విశేషాలివీ!
సోషల్ రోబోలు ఏం చేస్తాయి?
సోషల్ రోబోలు అంటే సామాజిక అంశాలపై అవగాహన కలిగిన రోబోలు. పిల్లలు, మహిళలు, ఒంటరిగా ఫీలయ్యేవారు, భయపడే మనస్తత్వం కలిగినవాళ్లు, ఉద్వేగానికి లోనయ్యే వారు, మానసిక ఒత్తిడితో సతమతం అయ్యేవారు ఇలా తీరొక్క రకం ఉంటారు. ఇలాంటి వారి పరిస్థితులపై అవగాహన కలిగిన సోషల్ రోబోలను చైనాలో తయారు చేస్తున్నారు. ఇవి మనుషుల మనసెరిగిన నేస్తంలా మసులుకుంటూ ఉండడం విశేషం. ఈ రోబోలు ఏఐ టెక్నాలజీని వినియోగించుకొని, మనిషిని పలకరిస్తాయి. ధైర్యం నూరిపోస్తాయి. జీవితంపై నమ్మకాన్ని పెంచుతాయి.
పిల్లల కోసం బూబూ
బూబూ (BooBoo) అనేది పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన సోషల్ రోబో. దీన్ని హాంగ్‌జౌ జెన్ మూర్ టెక్నాలజీ కంపెనీ తయారు చేసింది. దీని ధర దాదాపు రూ.16,500 మాత్రమే. 2024 మే నుంచి ఇప్పటి వరకు చైనాలో దాదాపు 1000 బూబూ రోబోలను విక్రయించారు.
బేబీ ఆల్ఫా
బేబీ ఆల్ఫా(BabyAlpha) అనేది ఏఐ కుక్క. దీన్ని వైలాన్ అనే చైనా కంపెనీ తయారు చేసింది. తమ పిల్లల వినోదం కోసం తల్లిదండ్రులు బేబీ ఆల్ఫాను కొంటున్నారు. దీనిలో వివిధ వెరైటీలు ఉన్నాయి. సాధారణ వెరైటీల ధర కనిష్ఠంగా రూ.95వేలు, టాప్ క్లాస్ వెరైటీల ధర రూ.3 లక్షల దాకా ఉన్నాయి. పిల్లలతో ముచ్చటించే ప్రత్యేకత కలిగిన ఈ కుక్కను ఇంత భారీ ధరలు పెట్టి మరీ కొన్ని సంపన్న కుటుంబాలు కొనేస్తున్నాయి.