Cowpea Seeds Germinate in Space:స్పేడెక్స్ ప్రయోగ విజయంతో 2024కు ఘనమైన ముగింపు పలికిన ఇస్రో మరో అద్భుతం సృష్టించింది. ఈ మిషన్‌లో భాగంగా శాస్త్రవేత్తలు PSLV-C60 ద్వారా అంతరిక్షంలోకి పంపిన అలసంద విత్తనాలు (బొబ్బర్లు) అక్కడే మొలకెత్తాయి. వ్యోమనౌక దూసుకెళ్లిన నాలుగు రోజుల్లోనే జీరో గ్రావిటీలో జరిగిన ఈ పరిణామం సైన్స్ ప్రపంచంలో ఉత్సుకతను రేకెత్తించింది.
స్పెడెక్స్ మిషన్‌లో భాగంగా అతరిక్షంలోకి పంపిన కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటాల్ ప్లాంట్ స్టడీస్ (CROPS) అనే పేలోడ్‌లో ప్రత్యేక పరిస్థితుల్లో అలసంద విత్తనాలను పంపించారు. ఈ పేలోడ్‌ను ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అభివృద్ధి చేసింది. ఈ ప్రయోగం అంతరిక్షంలోని వివిధ వాతావరణాలలో మొక్కలు ఎలా పెరుగుతాయో తెలుసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. జీరో గ్రావిటీలో మొక్కల పెరుగుదలను అధ్యయనం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఆస్ట్రోనాట్స్ తమ ఆహారాన్ని రోదసిలోనే సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో లాంగ్- టెర్మ్ స్పేస్ ప్రాజెక్ట్‌ల కోసం దీన్ని తెలుసుకోవడం చాలా అవసరం.
రోదసిలో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియకు ఉద్దేశించిన స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ (స్పేడెక్స్) కోసం గత నెల 30న PSLV-C60 రాకెట్ ద్వారా రెండు ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. ఆ రాకెట్‌లోని నాలుగో దశ (POEM-4)ను ఉపయోగించుకొని 24 పేలోడ్‌లను కక్ష్యలోకి పంపింది. ఇందులో కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ (CROPS) అనే ఇన్స్ట్రుమెంట్ కూడా ఉంది. ఇందులో 8 అలసంద విత్తనాలను పంపించగా అవి సూక్ష్మ గురుత్వాకర్షణలో నాలుగు రోజుల్లోనే మొలకెత్తాయి. దీనిపై ఇస్రో హర్షం వ్యక్తం చేసింది. 'అంతరిక్షంలో జీవం మొలకెత్తింది.. త్వరలోనే ఆకులు వస్తాయని ఆశిస్తున్నాం' అంటూ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.
అంతరిక్షంలో మొక్కలను పెంచడంలో, వాటి స్థిరమైన మనుగడలోISRO సామర్థ్యాన్ని పెంచేందుకు CROPSను మల్టీ-స్టేజ్ ల్యాబ్‌గా రూపొందించారు. దీన్ని బోర్డ్‌లో ఫుల్లీ ఆటోమేటిక్ సిస్టమ్‌గా డిజైన్ చేశారు. జీరో గ్రావిటీ వాతావరణంలో 5 నుంచి 7 రోజుల పాటు విత్తనాన్ని మొలకెత్తించి, రెండు ఆకుల దశకు వచ్చే వరకు సరైన పోషకాహారం అందించాలని ఇస్రో యోచిస్తోంది.
ప్రయోగంలో కీలక విషయాలు:
- అంతరిక్షంలో మొక్కల పెరుగుదలపై అధ్యయనం
- భవిష్యత్ లాంగ్-టెర్మ్ స్పేస్ మిషన్లకు సహాయం చేయడం
- అంతరిక్షంలో శాస్త్రవేత్తలకు పౌష్టికాహారం సిద్ధం చేయడం
- జీరో గ్రావిటీలో మొక్కల పెరుగుదలపై పరిశోధన
- గగన్‌యాన్, స్పేస్ స్టేషన్ వంటి భవిష్యత్తులో ముఖ్యమైన ప్రాజెక్టుల నిర్మాణంలో ఇస్రో కీలక పాత్ర పోషించడం