ISRO PROBA 3 Mission: ఇస్రో మరో ఘనతను సాధించేందుకు సిద్ధమైంది. ఈసారి ఏకంగా సూర్యుడిపైనే అధ్యయనం చేసేందుకు రెడీ అయింది. ఈ మేరకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 'ప్రోబా-3' మిషన్‌లో భాగంగా ఇస్రో.. డిసెంబర్ 4న రెండు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ ద్వారా ఈ ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు.
ఈ పీఎస్‌ఎల్‌వీ-సీ59/ప్రోబా-3 మిషన్‌లో.. కరోనాగ్రాఫ్ స్పేస్‌క్రాఫ్ట్ (CSC), ఓకల్టర్ స్పేస్‌క్రాఫ్ట్ (OSC) అనే రెండు అంతరిక్ష నౌకలు ఉంటాయి. ఈ రెండింటి బరువు సుమారు 550 కిలోలు. వీటిని 'స్టాక్డ్ కాన్ఫిగరేషన్'లో అంటే ఒకదానిపై మరొకటి అమర్చి రెండింటినీ కలిపి ఒకేసారి ప్రయోగించనున్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం 4:06 గంటలకు ఈ రెండు శాటిలైట్లను ప్రయోగించనున్నట్లు ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ప్రయోగం కోసం ఇస్రో తన అత్యంత విశ్వసనీయమైన, సమర్థవంతమైన PSLV (పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్) రాకెట్ XL వెర్షన్‌ను ఉపయోగిస్తోంది. ఇస్రో దగ్గర ఉన్న మొత్తం ఐదు PSLV వేరియంట్స్‌లో ఇది మోస్ట్ పవర్ ఫుల్ రాకెట్. ఈ రాకెట్ సాధారణ PSLV కంటే చాలా శక్తివంతమైనది. ఎందుకంటే సాధారణ PSLV రాకెట్ 4 బూస్టర్లను మాత్రమే ఉండగా.. ఇది 6 పెద్ద బూస్టర్లను కలిగి ఉంటుంది.
దీని ఒక్కో బూస్టర్ 12 టన్నుల ప్రొపెల్లెంట్ (రాకెట్‌కు ఫ్యూయెల్ వంటిది) క్యారీ చేయగలదు. PSLV-XL రాకెట్ అనేది భారతదేశపు మొట్ట మొదటి లిక్విడ్ ఫేజ్ వెహికల్. ఇది ఫ్యూయల్, లిక్విడ్ ఫ్యూయల్ రెండింటినీ ఉపయోగించుకుంటుంది. ఈ రెండు రకాల ఫ్యూయెల్స్ కలయిక వల్ల రాకెట్‌కు ఎక్స్ట్రా పవర్ లభిస్తుంది. దీంతో ఇది నార్మల్ PSLV రాకెట్ కంటే ఎక్కువ బరువున్న శాటిలైట్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లగలదు.