CM Revanth on Jobs in Peddapalli : తెలంగాణ ఇస్తామని సోనియా మెుదట ఈ గడ్డ పైనుంచే చెప్పారని, ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆమె ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజల ఆశీస్సులతోనే సామాన్యుడినైన తాను సీఎం అయ్యారని తెలిపారు. తెలంగాణ తెచ్చుకున్నది ఉద్యోగాల కోసమేనని, దాని కోసమే ఖమ్మం జిల్లా పాల్వంచలో మెుదట ఉద్యమం మెుదలైందని గుర్తుచేశారు. తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా రాజ్యం.. రాష్ట్రంగా మారిందని వ్యాఖ్యానించారు. ఇవాళ పెద్దపల్లిలో జరిగిన యువవికాసం సభలో ఆయన పాల్గొని గ్రూప్-4, సింగరేణి ఉద్యోగాలకు ఎంపికైనవారికి నియామక పత్రాలను అందజేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాలను, సీఎం కప్ ట్రోఫీని ఆవిష్కరించారు.
పెద్దపల్లి జిల్లాలో రూ.వందల కోట్ల పనులు పూర్తి చేసుకున్నామని సీఎం రేవంత్ తెలిపారు. మంత్రి శ్రీధర్‌బాబు తమను బెదిరించి పనులు చేయించుకున్నారని సరదాగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పదేళ్ల పాలనను.. ఏడాది పాలనను పోల్చి చూడాలని విజ్ఞప్తి చేస్తున్నామని కోరారు. ప్రతిపక్షాల చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనే అత్యధికంగా వడ్లు పండిస్తున్న జిల్లా పెద్దపల్లి అని అన్నారు. ఏడాదిలో 55 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. మోదీ సీఎం, పీఎంగా ఉంటూ గుజరాత్‌లో ఏడాదిలో 55 వేల ఉద్యోగాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు.
'రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్ పాల్గొనట్లేదు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు బీసీ వ్యతిరేకులా ? కేసీఆర్ శాసనసభకు రావాలి'- రేవంత్‌రెడ్డి, సీఎం
పదేళ్లు పాలించారని, పది నెలలైనా ఆగలేరా : ఉద్యోగాలపై మాట్లాడాలని మోదీ, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. వడ్లు పండించమని చెప్పామని, అందుకే మద్దతు ధర, బోనస్ ఇస్తున్నామని సీఎం చెప్పారు. చాలా ఏళ్ల తర్వాత ఆడబిడ్డల కళ్లలో సంతోషం చూశానని వ్యాఖ్యానించారు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తామని పేర్కొన్నారు. కోటి మంది ఆడబిడ్డలు ఓటేస్తే మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శాతవాహన వర్సిటీకి ఇంజినీరింగ్, లా కాలేజీలు మంజూరు చేస్తామని ప్రకటించారు.
ప్రభుత్వం ఒక్కరోజులోనే అద్భుతాలు సృష్టిస్తుందా ? సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఏ పని చేయాలన్నా విధివిధానాలు ఉంటాయని పేర్కొన్నారు. పదేళ్లు పాలించారని, పది నెలలైనా ఆగలేరా? అన్నారు. కేసీఆర్ శాసనసభకు రావాలని, తన మేధావితనాన్ని ప్రజలకు పంచాలని ఉద్ఘాటించారు. ఎకరంలో కోటి రూపాయల పంట ఎలా పండించారో కేసీఆర్ రైతులకు చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. కులగణనలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పాల్గొనట్లేదని, వారు బీసీ వ్యతిరేకులా? అని నిలదీశారు.