ISRO Proba 3 Launch Success: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రోబా-3 ప్రయోగం విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV-C59/PROBA-3 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.
ప్రోబా-3 మిషన్‌లో భాగంగా సుమారు 550 కిలోల బరువున్న రెండు ఉపగ్రహాలను PSLV-C59 వాహకనౌక మోసుకెళ్లింది. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం ద్వారా రెండు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. ఈ మేరకు ప్రయోగం విజయవంతంపై శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ప్రయోగం ఎందుకంటే?:సూర్యుడి బయటి పొర అయిన కరోనాను అధ్యయనం చేసేందుకు 'పీఎస్‌ఎల్‌వీ-సీ59/ప్రోబా-3' మిషన్‌ను చేపట్టారు. దీన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) అభివృద్ధి చేసింది. ఈ మిషన్‌లో.. కరోనాగ్రాఫ్ స్పేస్‌క్రాఫ్ట్ (CSC), ఓకల్టర్ స్పేస్‌క్రాఫ్ట్ (OSC) అనే రెండు ఉపగ్రహాలు ఉంటాయి. వీటిని 'స్టాక్డ్ కాన్ఫిగరేషన్'లో అంటే ఒకదానిపై మరొకటి అమర్చి రెండింటినీ కలిపి ఒకేసారి లాంఛ్ చేశారు.
ఈ రెండు శాటిలైట్లను ఇస్రో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) ద్వారా ప్రయోగించారు. 'ప్రోబా-3' మిషన్‌లో భాగంగా 'PSLV-XL' రాకెట్ రెండు ఉపగ్రహాలను సరైన కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అనంతరం ఈ రెండు శాటిలైట్లు పరస్పరం సమన్వయంతో ఒక క్రమపద్ధతిలో సూర్యుని చుట్టూ భూకక్ష్యలో తిరగనున్నాయి.