ISRO SpaDeX Docking Postponed: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన స్పేడెక్స్ మిషన్‌లో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ వాయిదా పడింది. ఇస్రో ముందస్తు ప్రణాళిక ప్రకారం.. ఈ డాకింగ్ ప్రక్రియ జనవరి 7న జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ మిషన్‌లో డాకింగ్ షెడ్యూల్‌ను జనవరి 9కి మార్చినట్లు ఇస్రో ప్రకటించింది.
కాగా ఇస్రో 30 డిసెంబర్ 2024న రాత్రి 10:00:15 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ (స్పేడెక్స్) ప్రయోగాన్ని చేపట్టింది. ఈ మిషన్‌లో శాస్త్రవేత్తలు PSLV-C60 ద్వారా SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) అనే రెండు శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించారు. ఈ రెండు ఉపగ్రహాల బరువు 440 కిలోలు.
స్పేడెక్స్ ప్రయోగం ద్వారా PSLV-C60 ఈ రెండు ఉపగ్రహాలను విజయవంతగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ రెండూ అంతరిక్షంలోనే డాకింగ్, అన్‌డాకింగ్ చేసేలా ప్రయోగాన్ని చేపట్టారు. వృత్తాకార కక్ష్యలో 2 ఉపగ్రహాలను ఏకకాలంలో డాకింగ్ చేసేలా శాస్త్రవేత్తలు ప్రణాళిక సిద్ధం చేశారు. భూ ఉపరితలం నుంచి 470 కిలోమీటర్ల ఎత్తులో ఈ అనుసంధాన ప్రక్రియ జరగనుంది.
అయితే రోదసిలో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ రేపు జరగనుండగా ఈరోజు మిషన్‌లో సమస్యను గుర్తించినట్లు ఇస్రో పేర్కొంది. ఈ కారణంగా డాకింగ్ ప్రక్రియపై మరికొంత పరిశోధన అవసరమని, ఈ నేపథ్యంలోనే దీని షెడ్యూల్ తేదీని మారుస్తున్నట్లు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో పోస్ట్ ద్వారా ప్రకటించింది.
ఈ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఇస్రో మరో వీడియోను పోస్ట్ చేసింది. ఈ 13 సెకన్ల వీడియోలో స్పేడెక్స్ రెండో శాటిలైట్ అంటే SDX02 (టార్గెట్) ప్రయోగాన్ని చూడొచ్చు. ఈ వీడియో SDX02 లాంఛ్ రెసిస్టెంట్ రిలీజ్ & డాకింగ్ రింగ్ ఎక్స్‌టెన్షన్‌ను చూపిస్తుంది. అంటే స్పేడెక్స్ లాంఛ్ సమయంలో SDX02 ప్రత్యేక హోల్డ్‌ను ఎలా తీసివేసి, ఆపై డాకింగ్ రింగ్‌ను ఎలా అభివృద్ధి చేసిందో ఇందులో కన్పిస్తుంది.
చంద్రుడిపై వ్యోమగామిని దించడం, చంద్రుడి నుంచి మట్టిని తీసుకురావడం, సొంత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)ను నిర్మించాలన్న భారత్ కల సాకారం కావాలంటే.. వ్యోమ నౌకల డాకింగ్, అన్ డాకింగ్ ఎంతో అవసరం. ఈ నేపథ్యంలోనే రోదసిలో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియకు ఉద్దేశించిన స్పేడెక్స్ ప్రయోగాన్ని చేపట్టింది.
ఇంతకీ డాకింగ్, అన్‌డాకింగ్ అంటే ఏంటి?:
డాకింగ్:రోదసిలో ఉన్న రెండు వస్తువులను ఒకదానికొకటి అనుసంధానం చేయడాన్నే డాకింగ్‌గా పిలుస్తారు. ఇప్పుడు ఇస్రో చేపట్టిన ఈ స్పేడెక్స్ మిషన్‌లో ప్రయోగించిన ఛేజర్ అనే శాటిలైట్ దానితోపాటే అంతరిక్షంలోకి పంపించిన టార్గెట్ అనే మరో ఉపగ్రహాన్ని కనుగొని దానికి కనెక్ట్ అవుతుంది. ఈ కనెక్షన్ రెండు రైలు కోచ్‌లు ఒకదానికొకటి కనెక్ట్ చేసినట్లుగా ఉంటుంది.