Latest 4 Instagram Features : ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ 4 సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే కంటెంట్ క్రియేటర్ల కోసం సరికొత్త ఎడిట్ ఆప్షన్లు తీసుకొచ్చిన ఇన్‌స్టాగ్రామ్, ఇప్పుడు తమ యూజర్ల కోసం మరో 4 కొత్త ఫీచర్లను జోడించింది. ఇవి ఇన్‌ఫ్లూయెన్సర్లు తమ ఫాలోవర్లతో కనెక్ట్ అయ్యేందుకు చాలా ఉపయోగపడతాయి. ఇంతకూ ఈ ఫీచర్లు ఏమిటి? ఎలా ఉపయోగించాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రివీల్
సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ అప్లోడ్ చేసే ముందు స్టిక్కర్ ఐకాన్‌పై క్లిక్ చేస్తే లొకేషన్, క్విజ్, హ్యాష్‌ట్యాగ్, అవతార్ లాంటి పలు ఆప్షన్లు కనిపిస్తాయి. ఇకపై అందులో ‘REVEAL’ అనే మరో ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే, ‘Message to reveal’ అనే ఒక మెసేజ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీ స్టేటస్‌కు సంబంధించిన హింట్ ఇవ్వవచ్చు. లేదా మీకు నచ్చిన మ్యాటర్‌ను టైప్ చేసి స్టోరీగా పోస్ట్ చేయవచ్చు. అంతే సింపుల్! ఎవరైనా మీ స్టోరీపై క్లిక్ చేస్తే మొదట మీరు పెట్టిన హింట్ కనిపిస్తుంది. వారు డీఎం చేస్తేనే మీ స్టోరీ రివీల్ అవుతుంది. మీరు పోస్ట్ చేసిన స్టోరీ ఫాలోవర్లకు ఎలా కనిపిస్తుందో తెలుసుకోవడానికి, ‘Preview’ ఆప్షన్ కూడా ఉంటుంది. అయితే ఇతరులు మీ స్టోరీ చూసేందుకు ప్రతి డీఎంను అప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు.
మీ స్టోరీకి ఫాలోవర్ల పాట
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మ్యూజిక్ యాడ్ చేయాలంటే ప్రత్యేకంగా మ్యూజిక్ సింబల్‌తో ఒక ఐకాన్ ఉంటుంది. దాని సాయంతో ఫొటోలకు, వీడియోలకు నచ్చిన పాటను యాడ్ చేసేవాళ్లం కదా. అయితే ఇప్పుడు మీ స్టోరీకి ఇతరులు కూడా సాంగ్ యాడ్ చేసేలా, ఇన్‌స్టాగ్రామ్ ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇందుకోసం మీరు స్టోరీ అప్లోడ్ చేసేముందు, స్క్రీన్‌పై కనిపించే స్టిక్కర్ ఐకాన్‌ను క్లిక్ చేయాలి. అప్పుడు ‘Add Yours Music’ అనే ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ‘+ / Add Music’ పేరుతో ఒక మెసేజ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దానిపై క్లిక్ చేసి, మీకు నచ్చిన పాటను ఎంచుకొని స్టోరీ పోస్ట్ చేయవచ్చు. ఫాలోవర్లు ఆ స్టోరీని చూసేటప్పుడు ‘Add Yours’ అనే బటన్ కనిపిస్తుంది. దాని సాయంతో వాళ్లకు నచ్చిన పాటను యాడ్ చేసుకోవచ్చు.