తెలంగాణ

telangana

ETV Bharat / technology

సైబర్ నేరగాళ్లు మీ ఐడెంటిటీని దొంగిలిస్తారు - పారా హుషార్! - What Is Identity Theft

What Is Identity Theft : ''థెఫ్ట్​లందు ఐడెంటిటీ థెఫ్ట్​ వేరయా'' అనేలా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. దీని గురించి చాలా మందికి ఐడియా లేదు. సాధారణంగానైతే దొంగలు డబ్బు, నగలు వంటి వస్తువులను దోపిడీ చేస్తుంటారు. కానీ కొందరు మాయగాళ్లు ఏకంగా మన ఐడెంటిటీనే దొంగిలిస్తారు. అదెలాగో తెలియాలంటే ఈ కథనం చదవండి.

5 common types of identity theft
Types of identity theft in Cyber Security (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 15, 2024, 3:37 PM IST

What Is Identity Theft :ప్రతి ఒక్కరికీ 'ఐడెంటిటీ' - అంటే గుర్తింపు అనేది చాలా ముఖ్యం. సాధారణంగా డబ్బు, నగలు వంటి వస్తువులను దోపిడీ చేయడం గురించి వినే ఉంటాం. కానీ ఐడెంటిటీని దొంగతనం చేయడం అంటే ఏమిటి? అసలు దాన్ని ఎలా దోపిడీ చేస్తారు? దాంతో ఏం చేస్తారు? అనే విషయాలు ఈ డిజిటల్ యుగంలో తెలుసుకోవడం అత్యంత ఆవశ్యకం.

ఐడెంటిటీ థెఫ్ట్ అంటే?
ఐడెంటిటీ థెఫ్ట్ అంటే ఎవరైనా మన వ్యక్తిగత డేటాను దొంగిలించడం. అంటే మన పేరు, సోషల్ సెక్యూరిటీ నంబర్, పుట్టిన తేదీ లాంటివి చోరీ చేయడమన్న మాట. మన పేరును, ఐడీని వాడుకొని, మన విలువైన సమాచారాన్ని చోరీ చేసేందుకు సైబర్ కేటుగాళ్లు ప్రయత్నించే రిస్క్ ఉంటుంది. మరో ముఖ్య విషయమేమిటంటే, అమెరికా ప్రభుత్వానికి చెందిన ఫెడరల్ ట్రేడ్ కమిషన్ 2023 సంవత్సరంలో దాని IdentityTheft.gov వెబ్‌సైట్ ద్వారా 10 లక్షల కంటే ఎక్కువ ఐడెంటిటీ థెఫ్ట్ రిపోర్ట్స్‌ను అందుకుంది.

ఈ రకం దొంగలు ఏం చేస్తారు?
ఎవరైనా మీ గోప్యమైన డేటాను మీలాగా చూపించడానికి లేదా మీ నుంచి దొంగిలించడానికి ఉపయోగించినప్పుడు ఐడెంటిటీ థెఫ్ట్ (గుర్తింపు దొంగతనం) జరుగుతుంది. ఈ రకం దొంగలు మీ బ్యాంక్, పెట్టుబడి ఖాతాలను చోరీ చేయడం, కొత్త క్రెడిట్ లైన్‌లను తెరవడం, యుటిలిటీ సేవను పొందడం, మీ ట్యాక్స్ రిటర్న్స్​ను దొంగిలించడం వంటివి చేస్తారు. వైద్య చికిత్సలు పొందడానికి మీ బీమా సమాచారాన్ని వాళ్లు వాడుకుంటారు. లేదంటే ఎక్కడైనా అరెస్టు అయినపుడు పోలీసులకు మీ పేరు, చిరునామాను ఇచ్చే రిస్కు కూడా ఉంటుంది.

క్రెడిట్ ఐడెంటిటీ థెఫ్ట్
సైబర్ నేరగాళ్లుకొత్త క్రెడిట్ లైన్ కోసం దరఖాస్తు చేయడానికి పుట్టిన తేదీ, సామాజిక భద్రత నంబర్ వంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించినప్పుడు క్రెడిట్ ఐడెంటిటీ థెఫ్ట్ జరిగినట్టు. మీరు మీ క్రెడిట్ స్కోర్‌లలో ఊహించని మార్పును లేదా మీ క్రెడిట్ రిపోర్ట్​లో గుర్తు తెలియని ఖాతాను చూస్తే అనుమానించి అలర్ట్ కావాలి. మీకు తెలియకుండానే మీకు వ్యతిరేకంగా లోన్ రికవరీ నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి టైంలో మీ లావాదేవీలను ఆపేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

చైల్డ్ ఐడెంటిటీ థెఫ్ట్
సైబర్ నేరగాళ్లు పిల్లల గుర్తింపును దొంగిలించి, వారి పేరు మీద లోన్ల కోసం దరఖాస్తు చేస్తారు. కళాశాల రుణాలు లేదా ఇతర రకం రుణాల కోసం దరఖాస్తు చేసుకునే వరకు ఈ విషయం బయటపడదు. మీ పిల్లలకు క్రెడిట్ కార్డ్‌ ఆఫర్‌లు లేదా ఆలస్య చెల్లింపులు లేదా రుణ రికవరీపై ఫోన్ కాల్స్ వస్తున్నట్లయితే, వెంటనే దర్యాప్తు చేయండి.

మెడికల్ ఐడెంటిటీ థెఫ్ట్
ఆరోగ్య సంరక్షణ సేవలను పొందడానికి వేరొకరి గుర్తింపును ఉపయోగించడాన్ని మెడికల్ ఐడెంటిటీ థెఫ్ట్ అంటారు. నిజానికి ఇది చాలా ప్రమాదకరమైనది. మీ హెల్త్ ఇన్సూరెన్స్, బీమా పాలసీల వివరాలతో కేటుగాళ్లు అప్లై చేసుకొని ప్రయోజనాలు పొందుతారు. మీరు లబ్ధి పొందకుండానే, పొందినట్టుగా మెసేజ్‌లు వస్తే అలర్ట్ కావాలి. ఎక్కడా మీ పాలసీల వివరాలను చెప్పకూడదు. ఇలాంటి సందర్భాల్లో మీరు మీ బీమా కంపెనీకి రిపోర్ట్ చేయాలి. మీ ఆరోగ్య సంరక్షణ రికార్డులలో సందేహాస్పదంగా కనిపించే సమాచారంపై కస్టమర్ కేర్ ఆఫీసర్ వద్ద ఆరాతీయాలి.

అకౌంట్ థెఫ్ట్
నేరగాళ్లు మీ ఆర్థిక ఖాతాలను యాక్సెస్ చేయడానికి వ్యక్తిగత డేటాను ఉపయోగిస్తారు. ఆపై పాస్‌వర్డ్‌లు లేదా చిరునామాలను మార్చుతారు. ఆ తర్వాత మీరు ఆ అకౌంట్​ యాక్సెస్​ను కోల్పోతారు. మీకు మీ మెయిల్, పాస్​వర్డ్ చేంజ్ వంటివి మెసేజ్​లు రాగానే వెంటనే స్పందించాలి. దగ్గర్లోని బ్యాంకులను సందర్శించాలి.

క్రిమినల్ ఐడెంటిటీ థెఫ్ట్
కేటుగాళ్లు ఎక్కడైనా అరెస్టయితే పోలీసు అధికారులకు మీ పేరు, చిరునామా ఇస్తారు. మీ ఐడీ కార్డులను సమర్పిస్తారు. నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌లను ఇచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఫ్యూచర్‌లో మీరు ఇబ్బందిపడతారు. మీరు ఏదైనా నేరం చేయకున్నా, చేసినట్టుగా మెసేజ్ వస్తే అనుమానించాలి. మీరు తప్పు చేయకున్నా, ఏదైనా జరిమానా పడితే డౌట్ రావాలి. లేదంటే ఇబ్బందుల్లో పడతారు.

ఐడెంటిటీ థెఫ్ట్ ఎలా జరుగుతుందంటే?

  • వ్యాలెట్​ను కోల్పోవడం
  • మెయిల్ బాక్స్ థెఫ్ట్​కు గురి కావడం
  • పబ్లిక్ వైఫైని ఉపయోగించడం
  • డేటా ఉల్లంఘన
  • SIM కార్డ్ స్వాప్
  • ఫిషింగ్ లేదా స్పూఫింగ్
  • ఫోన్ మోసాలు
  • ఫోన్‌ లేదా డిజిటల్ డివైజ్‌లోకి మాల్ వేర్

ఐడెంటిటీ థెఫ్ట్ గురించి ఎలా రిపోర్ట్ చేయాలి?
మీ ఐడెండిటీని ఎవరైనా దొంగిలించినట్లు గుర్తిస్తే, వెంటనే సమీపంలోని పోలీసులకు సమాచారాన్ని అందించాలి. పోలీసులు మీకు సైబర్ నేరాల దర్యాప్తు విభాగం సమాచారాన్ని అందిస్తారు. వారిని సంప్రదించి మీకు జరిగిన మోసం గురించి వివరించాలి. సైబర్ క్రైం విభాగం విచారణ నిర్వహించి నేరం మూలాలను వెలికితీస్తుంది. ఒకవేళ ఆర్థికంగా నష్టం జరిగి ఉంటే, సంబంధిత బ్యాంకులు, ఆస్పత్రులకు సమాచారాన్ని చేరవేయాలి. పోలీసులకు ఫిర్యాదు చేసిన కాపీని కూడా ఆ సమాచారానికి జతపర్చాలి.

మీ ఐఫోన్​కు 2 జతల AirPods​ కనెక్ట్ చేసుకోవచ్చు - ఎలాగో తెలుసా? - AirPods Share Audio Feature

తరచుగా సిమ్ కార్డ్​లు మారుస్తుంటారా? ఇకపై ఆ లిమిట్ దాటితే కొత్త SIM ఇవ్వరు తెలుసా? - SIM Card Limit On Aadhaar Card

ABOUT THE AUTHOR

...view details