Hyundai Creta EV:ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా కొత్త ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. 'హ్యుందాయ్ క్రెటా ఈవీ' పేరుతో దీన్ని పరిచయం చేసింది. కంపెనీ దీన్ని భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025 వేదికగా జనవరి 17న లాంఛ్ చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ కారు లుక్‌తో పాటు ఇతర వివరాలను వెల్లడించింది.
దేశంలో పాపులర్ కార్లలో హ్యుందాయ్ విక్రయిస్తున్న కార్లలో క్రెటా ఒకటి. ప్రస్తుతం ఇదే పేరుతో ఈవీ వెర్షన్‌ను కంపెనీ తీసుకొస్తోంది. సాధారణ క్రెటా కారును పోలిన డిజైన్‌తోనే క్రెటా ఎలక్ట్రిక్‌ను కూడా రూపొందించింది. ఈ కారుకు ముందువైపు ఛార్జింగ్ పోర్ట్‌ను అందిస్తున్నారు. దీనితోప పాటు ఇందులో డిజిటల్ కీ, లెవల్-2 ADAS, 360 డిగ్రీ కెమెరా వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇన్ని మెరుగైన ఫీచర్లతో కంపెనీ దీన్ని అందుబాటు ధరలోనే తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
వేరియంట్స్:హ్యుందాయ్ మోటార్ ఈ ఎలక్ట్రిక్ కారును నాలుగు వేరియంట్లలో తీసుకురానుంది.
- ఎగ్జిక్యూటివ్
- స్మార్ట్
- ప్రీమియం
- ఎక్స్‌లెన్స్
బ్యాటరీ ప్యాక్స్:ఈ కారు రెండు రకాల బ్యాటరీ ప్యాక్స్‌తో వస్తుంది. దీని 42 kWh బ్యాటరీతో ఈ కారుసింగిల్ ఛార్జ్‌తో 390 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇక ఈ కారులోని 51.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో 473 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు.
ఇక ఈ కొత్త 'హ్యుందాయ్ క్రెటా ఈవీ' ఛార్జింగ్ విషయానికొస్తే.. డీసీ ఛార్జర్‌తో దీన్ని కేవలం 58 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయొచ్చని కంపెనీ చెబుతోంది. అదే 11kW ఏసీ హోమ్ ఛార్జర్‌తో అయితే 10 నుంచి 100 శాతం ఛార్జింగ్ చేయడానికి 4 గంటల సమయం పడుతుందని పేర్కొంది.