Google Cloud Next 2024: టెక్ దిగ్గజం గూగుల్ తమ వర్క్‌స్పేస్ సూట్ వినియోగదారుల కోసం సరికొత్త అప్డేట్స్ తీసుకొచ్చింది. గూగుల్ డాక్స్, మీట్, చాట్, షీట్ లాంటి ప్రొడక్టుల్లో అత్యాధునిక ఏఐ సామర్థ్యాలను పొందుపరిచినట్లు తెలిపింది. లాస్ వెగస్లో జరిగిన గూగుల్ క్లౌడ్ నెక్ట్స్-2024 కాన్ఫిరెన్స్‌లో ఈ విషయాలను వెల్లడించింది.
'Help Me Write' (హెల్ప్ మీ రైట్)
మొబైల్లో జీ-మెయిల్స్ ఉపయోగించే వారికి ఈ 'హెల్ప్ మీ రైట్' ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రయాణాల్లో ఉన్నప్పుడు మెయిల్స్ కంపోజ్ చేయడం సులభం అవుతుంది. మీరు సింపుల్‌గా ఒక్క క్లిక్ ఇచ్చి వాయిస్ ద్వారా మీకు కావాల్సిన మేటర్‌ను కంపోజ్ చేయవచ్చు. అలాగే 'ఇన్స్టంట్ పాలిష్' ఫీచర్ ద్వారా ఎలాంటి స్పెల్లింగ్, గ్రామర్ మిస్టెక్స్ లేకుండా మెయిల్స్ కంపోజ్ చేయడానికి వీలవుతుంది.
Google Docs (గూగుల్ డాక్స్)
మీకు కావాల్సిన సమాచారమంతా ఒక డాక్యుమెంట్‌లోనే ఉండే విధంగా గూగుల్ డాక్స్‌లో కొత్త ట్యాబ్‌ను తీసుకొచ్చింది. కనుక ఇక నుంచి మనకు కావాల్సిన సమాచారం కోసం అన్ని డాక్యుమెంట్‌ను వెతకాల్సిన అవసరం ఉండదు. సమాచారమంతా ఒకే చోట ఉంటుంది. అలాగే ఫొటోలను కూడా కావాల్సిన సైజులో పెట్టుకునే విధంగా త్వరలో గూగుల్ డ్రైవ్‌ను అప్డేట్ చేస్తున్నట్లు తెలిపింది.
Google Meet ( గూగుల్ మీట్)
గూగుల్ మీట్లో 'Take Notes for me' అనే ఫీచర్ తీసుకురానుంది. ఇది మీ కోసం నోట్స్ రాస్తుంది. అందువల్ల మీరు స్వయంగా నోట్స్ రాసుకోవలసిన అవసరం ఉండదు. ఇది ఏఐ సామర్థ్యంతో గూగుల్ మీట్, చాట్‌ల్లో పని చేస్తుంది. కాకపోతే ఈ యాడ్-ఆన్ ఫీచర్ కోసం నెలకు 10 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. గూగుల్ మీట్‌ను ఇప్పుడు గరిష్ఠంగా 5,00,000 మంది ఉపయోగించుకునేలా విస్తరించింది గూగుల్.