ISRO and NASA Joint Mission:మన దేశానికి చెందిన ఇస్రో, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కలిసి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగనయాన్ మిషన్‌కు సంబంధించిన మొదటి దశ అయిన ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ పూర్తయింది. ఈ మేరకు దీనికి సంబంధించిన సమాచారాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) అధికారికంగా ప్రకటించింది.
మానవ సహిత రోదసియాత్రకు ఎంపికైన వ్యోమగాములు.. ప్రైమరీ క్రూ మెంబర్ గ్రూప్ కెప్టెన్ సుభాన్షు శుక్లా, బ్యాకప్ క్రూ మెంబర్ గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ తమ ప్రాథమిక శిక్షణను అమెరికాలో పూర్తి చేసుకున్నట్లు ఇస్రో తెలిపింది. ఈ గగనయాన్ మిషన్‌ను 2026 చివరిలో ప్రయోగించేందుకు షెడ్యూల్ చేశారు. అన్నీ అనుకున్నట్లుగానే జరిగి ఈ మిషన్ పూర్తయితే.. ఇది ఇండియా మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర అవుతుంది.
ఆస్ట్రోనాట్స్ ట్రైనింగ్:గగనయాన్ మిషన్‌కు సంబంధించి వ్యోమగాముల ట్రైనింగ్ ఆగస్టులో ప్రారంభమైంది. ఈ మిషన్ కోసం ఎంపికైన ఆస్ట్రోనాట్స్‌కు తగిన విధంగా శిక్షణను అందించి సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రైనింగ్‌లో భాగంగా మొదటి దశను వ్యోమగాములు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్నట్లు ఇస్రో తెలిపింది. అంతేకాక వారికి ISS ( ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్) వ్యవస్థలను కూడా పరిచయం చేసినట్లు ఇస్రో తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొంది.
అయితే ఐఎస్‌ఎస్, గగన్‌యాన్ రెండూ వేర్వేరు రకాల అంతరిక్ష యాత్రలు. గగన్‌యాన్ యాత్ర కోసం ఐఎస్‌ఎస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. కాకపోతే అంతరిక్ష యాత్రకు సంబంధించి ఐఎస్‌ఎస్ వాస్తవిక అనుభవాలు గగన్‌యాన్‌కూ ఉపయోగపడొచ్చని ఇస్రో భావిస్తుండొచ్చు.