Fire Accident at Tata Electronics Factory:తమిళనాడులోని హోసూర్‌లోని టాటా ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రాథమిక నివేదికల ప్రకారం సెల్‌ఫోన్ తయారీ విభాగంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశాయి. తయారీ యూనిట్ ఉద్యోగులను సురక్షితంగా బయటకు తరలించటంతో ఈ ప్రమాందలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
భారీగా ఆస్తినష్టం:ఈ అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు. అయితే కోట్ల రూపాయల విలువైన ఆస్తినష్టం జరిగింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం నాగమంగళం సమీపంలోని ఉద్నపల్లిలో కంపెనీకి చెందిన మొబైల్ఫోన్ యాక్సెసరీస్ పెయింటింగ్ యూనిట్‌లో ఉదయం 5:30 గంటలకు మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. ఎక్కడ చూసినా పొగలు కమ్ముకున్నాయి. దీంతో ఉద్యోగులు, స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభం: ఈ ప్రమాదం సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వెంటనే అగ్నిమాపక దళానికి చెందిన అనేక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. తయారీ యూనిట్ ఉద్యోగులను అగ్నిమాపక సిబ్బంది బయటకు సేఫ్‌గా తరలించారు. ఇప్పటి వరకు ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు మొదటి షిఫ్ట్‌లో సుమారు 1,500 మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నారని సమాచారం.