SpaceX Creates New Record:ఎలాన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్ అరుదైన ఘనత సాధించింది. నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ బూస్టర్‌ను తిరిగి లాంచ్‌ప్యాడ్ దగ్గరకే సురక్షితంగా చేర్చి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఒక రాకెట్‌కు చెందిన బూస్టర్‌ను తిరిగి లాంచ్ ప్యాడ్ వద్దకే తీసుకురావడం ఇదే తొలిసారి. దీంతో రాకెట్ ప్రయోగ టెక్నాలజీలో గణనీయమైన విజయాన్ని స్పేస్‌ఎక్స్ సంస్థ తన ఖాతాలో వేసుకుంది.
ప్రపంచంలోనే అతిపెద్దదైన 'స్టార్‌షిప్' మెగా రాకెట్‌ను స్పేస్లోకిపంపించారు. ఆదివారం టెక్సస్ తీరంలో ఈ ప్రయోగం నిర్వహించారు. 121 మీటర్ల పొడవు కలిగిన ఈ స్టార్‌షిప్ రాకెట్లో బూస్టర్, స్పేస్‌క్రాఫ్ట్ అని రెండు విభాగాలుంటాయి. అంతరిక్షంలోకి ఈ రాకెట్‌ను ప్రయోగించిన కొద్దిసేపటి తర్వాత బూస్టర్ నుంచి స్పేస్‌క్రాఫ్ట్ విడిపోయింది.
స్పేస్‌క్రాఫ్ట్‌ను హిందూ మహాసముద్రంలో దింపేశారు. బూస్టర్‌ను మాత్రం లాంచ్ ప్యాడ్ వద్దకే సురక్షితంగా తీసుకొచ్చారు. అపోలో ప్రోగ్రాం సాటర్న్ V కంటే రెట్టింపు శక్తి కలిగిన ఈ రాకెట్ బూస్టర్ తెల్లవారుజామున ఆకాశంలోకి నీలిరంగు జ్వాలలను చిమ్ముతూ నేలపైకి దూసుకువచ్చింది. ఈ రాకెట్ బూస్టర్‌ను లాంచ్ ప్యాడ్ దగ్గర ఏర్పాటు చేసిన చాప్‌స్టిక్స్ విజయవంతంగా ఒడిసిపట్టుకున్నాయి. ఈ అద్భుతాన్ని లైవ్ స్ట్రీమ్ చేయగా.. చాలామంది ప్రత్యక్షంగా వీక్షించారు.