Earth Temporary Second Moon 2024 PT5: మన రెండో చందమామ భూమికి గుడ్ బై చెప్పే సమయం దగ్గర పడింది. మరి కొన్ని రోజుల్లో ఈ మినీ మూన్ మనల్ని వదిలి వెళ్లిపోనుంది. అసలు ఆకాశంలో ఇద్దరు చందమామలు ఉన్నారని మీకు తెలుసా? మనం రోజూ ఒకే చంద్రుడిని చూస్తున్నాం కదా? మరి ఈ మినీ మూన్ ఏంటి? అని అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ సమాచారం.
ఆకాశంలో ఇటీవలే ఓ అద్భుతం సాక్షాత్కారమైంది. మన భూమికి ఉన్న చంద్రుడికి తోడు మరో మూన్ వచ్చి చేరాడు. నాసాకు చెందిన అట్లాస్ (ఆస్టరాయిడ్ టెరెస్ట్రియల్-ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్) పరికరం ద్వారా ఇటీవలే ఆగస్టు 7న శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు. ఇది 10 మీటర్ల లేదా 33 అడుగుల వ్యాసంతో ఉండే గ్రహశకలం. సూర్యుని చుట్టూ పరిభ్రమించే '2024 PT5' అనే ఈ గ్రహశకలం భూమి గురుత్వాకర్షణ పరిధిలోకి రావడంతో అది మినీ చంద్రుడిగా మారిపోయింది.
సూర్యుడు, భూమి గురుత్వాకర్షణ శక్తి సంయుక్త ప్రభావంతో ఈ అద్భుతం సాక్షాత్కారం అయింది. సూర్యుని చుట్టూ పరిభ్రమించే ఈ గ్రహశకలం కొన్నేళ్లుగా భూమికి దగ్గరగా జరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. సూర్యుడి గురుత్వాకర్షణ ప్రభావంలో ఉన్న ఈ ఆస్ట్రాయిడ్ మెల్లగా భూమి గురుత్వాకర్షణ పరిధిలోకి వచ్చి చేరింది. ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. ఇది కొంతకాలం భూమి చుట్టూ సంక్లిష్ట మార్గంలో తిరుగుతూ తిరిగి సౌర వ్యవస్థలోకి వెళ్లిపోనుందని వెల్లడించారు.