Interesting Features in Google Maps:ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు తమకు కావాల్సిన అడ్రస్ వెతుక్కునేందుకు గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది సుదూర ప్రాంతాలు, కొత్త ప్రాంతాలకు వెళ్లేటప్పుడు అక్కడి రూట్స్, షార్ట్ కట్ మార్గాలను తెలుసుకునేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లేటప్పుడు గూగుల్ మ్యాప్స్ చాలా రూట్ ఆప్షన్స్‌ను అందిస్తుంది. దీంతో మనం తక్కువ సమయంలో మన గమ్య స్థానాన్ని చేరుకునే మార్గాన్ని ఎంచుకోవచ్చు.
దీంతోపాటు 'Avoid Toll', 'Avoid Highway' వంటి ఆప్షన్స్‌ను కూడా ఉపయోగించుకుని ప్రయాణాన్ని మరింత మెరుగుపర్చుకోవచ్చు. ఇలా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా గూగుల్ మ్యాప్స్‌లో కొంగొత్త ఫీచర్లను జోడిస్తున్నారు. ఈ సెర్చింజన్లోని అడ్వాన్స్డ్ ఫీచర్లతో మంచి ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్‌ను పొందొచ్చు. ఇవేకాక గూగుల్ మ్యాప్స్‌లో మనకు తెలియని చాలా ఫీచర్లు ఉన్నాయి. ఇంతకీ ఏంటా ఫీచర్లు? వాటి ఉపయోగం ఏంటి? వంటి వివరాలు మీకోసం.
ఆఫ్‌లైన్ వినియోగం:మన దేశంలో నేటికీ కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఆఫ్‌లైన్ మ్యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవడం వలన అంతరాయం లేని నావిగేషన్ లభిస్తుంది. ఇందుకోసం యాప్‌లో మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో సెర్చ్ చేసి డౌన్లోడ్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫీచర్ గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఉపయోగపడుతుంది.
రియల్‌టైమ్ లొకేషన్: సాధారణంగా మనం ఏదైనా లొకేషన్ సెట్ చేసుకున్నప్పుడు ప్రివ్యూ మాములుగా కనిపిస్తుంది. అలా కాకుండా రియల్ టైమ్ లొకేషన్స్ కనిపించాలంటే అందుకోసం రూట్ ప్రివ్యూ పక్కన ఉన్న థ్రీ డాట్స్‌ను సెలక్ట్ చేసుకుని శాటిలైట్, ట్రాఫిక్ ఆప్షన్స్‌ను సెలక్ట్ చేసుకుంటే బెస్ట్ ప్రివ్యూ కనిపిస్తుంది.